తిరువూరు ఫైట్.. మామూలుగా లేదుగా!
ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ-ప్రతిపక్షాల మధ్య యుద్ధం మామూలు గా ఉండదనే విశ్లేషణలు తరచుగా వస్తున్నాయి.
By: Tupaki Desk | 23 July 2023 12:45 PM ISTఏపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ-ప్రతిపక్షాల మధ్య యుద్ధం మామూలు గా ఉండదనే విశ్లేషణలు తరచుగా వస్తున్నాయి. సరే.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం తిరువూరులో మాత్రం ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీల మధ్య ఎన్నికల పోరు తీవ్రంగా ఉండేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.
తిరువూరు నియోజకవర్గం.. మైలవరానికి సమీపంలోనే ఉంటుంది. అంతేకాదు.. ఒకప్పుడు టీడీపీకి కంచు కోటగా కూడా ఉంది. 1983లో పార్టీ పెట్టినప్పుడు.. గెలిచిన నియోజకవర్గాల జాబితాలోనూ ఇది ఉంది. వరుస విజయాలు దక్కించుకున్న తర్వాత.. తమ్ముళ్ల మధ్య ఏర్పడిన చీలికల కారణంగా.. ఇక్కడ టీడీపీ హవా పలచబడిందనే వాదన ఉంది. ఇదిలావుంటే.. గత ఇరు సంవత్సరాల్లో ఇక్కడ టీడీపీ పెద్దగా ప్రభావం చూపించడం లేదు.
2004 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరగ్గా.. తొలి రెండు సార్లు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకున్నాయి. ఇక, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకింత వీక్ అయ్యారనే వాదన టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే రక్షణనిధి.. ఆ పదవి ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉండి.. ప్రజలకు దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు. ఇక్కడ గతంలో రెండు సార్లు విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు నల్లగట్ల స్వామి దాసును కాదని.. ఈసారి ఆర్థికంగా బలంగా ఉన్న శావల దేవదత్‌కు చంద్రబాబు దాదాపు టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలిసింది. దీంతో ఇక్కడ మార్పు కొరుకుంటున్న తిరువూరు ఓటర్లు తమవెంటే ఉంటారని టీడీపీ లెక్కలు కడుతోంది. అయితే.. వైసీపీ మాత్రం సంప్రదాయ ఎస్సీ ఓటు తమకే ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా ఇక్కడి రాజకీయ పరిణామాలు చూస్తే.. ఇరు పక్షాల మధ్య హోరా హోరీ పోరు ఉంటుందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
