Begin typing your search above and press return to search.

ఆ జిల్లాలో ఒక్క సీటు తప్ప అంతా సేమ్ టూ సేమ్...!?

ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీలో పెద్దగా మార్పు చేర్పులు ఉండవని అంటున్నారు. జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   20 Jan 2024 3:39 AM GMT
ఆ జిల్లాలో ఒక్క సీటు తప్ప అంతా సేమ్  టూ సేమ్...!?
X

ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీలో పెద్దగా మార్పు చేర్పులు ఉండవని అంటున్నారు. జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఒకే ఒక్క సీటులో మార్పు కనిపిస్తోంది అని అంటున్నారు. అది తప్ప మొత్తం మిగిలినది అంతా సేమ్ టూ సేమ్. 2019 మాదిరిగానే ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ జిల్లాలో అసెంబ్లీ సీట్ల విషయం తీసుకుంటే మొదటిగా జిల్లాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి మరోమారు పోటీకి ఖాయం అయింది. అలాగే ఆయన తమ్ముడు గజపతినగరం సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కూడా అదే సీటు నుంచి పోటీకి రెడీ అయిపోతున్నారు.

విజయనగరం ఎమ్మెల్యేగా మరోసారి కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారు అని అంటున్నారు. నెల్లిమర్ల నుంచి బడికొండ అప్పలనాయుడు. అలాగే ఎస్ కోట నుంచి కడుబండి శ్రీనివాసరావు మరోసారి పోటీకి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు అని అంటున్నారు. అలాగే సాలూరు నుంచి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, పార్వతీపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, కురుపాం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక మిగిలింది ఒకే ఒక్క సీటు. అదే బొబ్బిలి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంబంగి చిన అప్పలనాయుడు ఉన్నారు. ఆయనకు మాత్రం టికెట్ డౌట్ అని అంటున్నారు. అక్కడ బొబ్బిలి రాజులు బలంగా ఉండడంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన కొత్త నేతను బరిలోకి దింపాలని వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

దాంతో విజయనగరం జిల్లాలో అందరికీ చాన్స్ దక్కి ఒక్క శంబంగి సీటేనా చిరిగిపోతుందా అన్న చర్చ మొదలైంది. రాజకీయంగా సీనియర్ నేత 1983 నుంచి బొబ్బిలిలో గెలుస్తూ వస్తున్న నేత అయిన శంబంగికి టికెట్ ఇవ్వాలని ఆయన అనుచర వర్గం కోరుతోంది. కానీ హై కమాండ్ మాత్రం ఈసారికి ఇంతే అన్నట్లుగా ఉందని అంటున్నారు.

విజయనగరం జిల్లా వరకూ చూస్తే బొత్స హవా మరోసారి సాగుతోందని అంటున్నారు. ఆయన చెప్పిన వారికే టికెట్లు మళ్లీ దక్కుతున్నాయి. అలాగే ఆయన సతీమణికి విశాఖ ఎంపీగా చాన్స్ వస్తోంది. ఇక ఆయన మేనల్లుడి మజ్జి శ్రీనివాసరావుని ఎంపీగా విజయనగరం నుంచి పోటీ చేయించడం ద్వారా మంత్రి పదవి విషయంలో పోటీ లేకుండా చూసుకుంటున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి.

మరో సన్నిహిత బంధువు ప్రస్తుత ఎంపీ అయిన బెల్లాన చంద్రశేఖర్ విషయంలో కూడా బొత్స ప్లాన్ ఏంటి అన్నది చూడాలి. హై కమాండ్ అయితే ఆయనను అసెంబ్లీకి తీసుకుని రావాలని చూస్తోంది. బెల్లాన ఎమ్మెల్యే అయితే మంత్రి పదవికి బొత్స కుటుంబం నుంచే పోటీ వస్తారు అని అంటున్నారు. సో ఆయన సీటు విషయంలో అటు బొత్స ఇటు వైసీపీ హై కమాండ్ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు అన్నది చూడాలని అంటున్నారు.