Begin typing your search above and press return to search.

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

టీడీపీకి కంచుకోటగా భావించే అనంతపురం కార్పొరేషన్‌లో వైసీపీ విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి గెలవగా, అనంతపురంలో వైసీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ మేయర్ పీఠం దక్కించుకోనున్నారు. బీజేపీకి కేటాయించిన ఈ స్థానంలో ఓటమికి కారణాలపై చంద్రబాబు నేతల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం.

By:  Garuda Media   |   5 Nov 2026 7:00 PM IST
అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !
X

టీడీపీకి కంచుకోట వంటి అనంత‌పురంలో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం వింత‌గా ఉంది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే.. 12 చోట్ల కూట‌మి పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్నారు. ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన పోటీ చేసిన కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌లో వంద‌శాతం ద‌క్కించ‌కున్నాయి. కానీ, అనంత‌పురం విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింది? అనే విష‌యం పై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల సరళి, అక్కడ జరిగిన రాజకీయ ఘర్షణ‌లు.. వంటివి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. కానీ, అనూహ్యంగా ఇక్క‌డ వైసీపీ విజ‌యం సాధించింది. ఆ పార్టీ అభ్య‌ర్థి ర‌మేష్ గౌడ్ మేయ‌ర్ పీఠం ఎక్కనున్నారు. అయితే.. వాస్త‌వానికి ఈ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో టీడీపీ వ‌ర్గాలు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను క‌ల‌సి క‌ట్టుగా బీజేపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. కానీ, ఎన్నిక‌ల అనంత‌రం.. ఇక్క‌డ వైసీపీ గెలుపు గుర్రం ఎక్క‌డంతో కూట‌మి నాయ‌కులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా నడుస్తున్నప్పటికీ, అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మాత్రం వైసీపీ గెల‌వ‌డం, అందునా.. కూటమికి గట్టి మ‌ద్ద‌తు ఉన్న జిల్లాలో ఇలా జ‌ర‌గ‌డం వంటి అంశాల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్ అయిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఎన్నికల లెక్కింపులో రౌండ్ రౌండ్‌కు సమీకరణాలు మారుతుండం, వైసీపీ గట్టి పోటీ ఇవ్వ‌డంతో, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే విషయంపై చంద్రబాబు పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు.

నివేదిక వ‌చ్చాక‌..

బీజేపీ విష‌యంలో చంద్ర‌బాబు సానుకూల దృక్ఫ‌థంతోనే ఉన్నారు. అయితే.. ఈ క్ర‌మంలోనే బీజేపీ కోరిన స్థానాల తో పాటు.. టీడీపీనుంచి పూర్తిస్థాయిలో స‌హ‌కారం కూడా అందించారు. అందుకే మునుపెన్న‌డూ లేని విధంగా బీజేపీ పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. తాజాగా జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో క‌మలం మ‌రింత విక‌సించింది. కానీ, కీల‌క‌మైన కార్పొరేష‌న్ స్థానంలో బీజేపీ ఓట‌మి.. అందునా 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ప‌రాజ‌యం వంటివి చంద్ర‌బాబును కూడా ఆలోచ‌న‌లో ప‌డేశాయి. దీంతో ఆయ‌న స్థానికంగా టీడీపీ నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రించారు? ఏం చేశారు? అనే విష‌యాల‌పై నివేదిక కోరిన‌ట్టు పార్టీ నేత‌లు తెలిపారు. నివేదిక వ‌చ్చాక‌.. త‌ప్పుల‌ను స‌రిచేస్తార‌ని.. అంటున్నారు.