Begin typing your search above and press return to search.

టీడీపీ సోషల్ మీడియా వేట.. కటకటాల్లోకి వైసీపీ కార్యకర్త!

మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి క్రిష్ణవేణి గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియాకు టార్గెట్ గా మారారు.

By:  Tupaki Desk   |   18 April 2025 3:46 PM IST
టీడీపీ సోషల్ మీడియా వేట.. కటకటాల్లోకి వైసీపీ కార్యకర్త!
X

ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా జైలే గతి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భార్యపై అనుచితంగా మాట్లాడిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ ను అరెస్టు చేయించిన కూటమి ప్రభుత్వం తాజాగా వైసీపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను అరెస్టు చేసి జైలుకు పంపింది.

మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి క్రిష్ణవేణి గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియాకు టార్గెట్ గా మారారు. గతంలో టీడీపీలో పనిచేసిన క్రిష్ణవేణి ఆ పార్టీలో కొందరి నేతలతో విభేదించి వైసీపీలో చేరారు. అయితే ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన స్క్రిప్టును తన సోషల్ అకౌంట్లలో పోస్టు చేస్తుండేవారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ మహిళా విభాగం అధికార ప్రతినిధి హోదాలో ఆమె పరిధులు దాటి చేసిన వ్యాఖ్యలు, పోస్టులు ఇప్పుడు ఆమె పాలిట ముప్పుగా మారాయి.

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ అరెస్టుకు ముందు ‘కిరణ్ ను అరెస్టు చేయకపోతే మేము కూడా నారా వారి కుటుంబంలో ఆడోళ్లను తిట్టి ఆ తర్వాత క్షమాపణలు చెప్పి వీడియో విడుదల చేస్తామంటూ’ క్రిష్ణవేణి హెచ్చిరిస్తూ చేసిన పోస్టు కూటమి ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించింది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గౌరవించకుండా చేస్తున్న పోస్టులు కూడా టీడీపీ సోషల్ మీడియాను ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి వివాహ వేడుకలో మంద క్రిష్ణ మాదిగకు అవమానం జరిగిందని క్రిష్ణవేణి చేసిన పోస్టు తెరపైకి వచ్చింది. ఆ పోస్టు ద్వారా వెంకయ్యనాయుడుతోపాటు మంత్రి నారా లోకేశ్ పై క్రిష్ణవేణి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

తనపై కేసు నమోదైందని తెలుసుకున్న క్రిష్ణవేణి మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయినా పోలీసులు వదల్లేదు. ఆమె ఆచూకీ తెలుసుకుని గురువారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని గుంటూరు తీసుకువచ్చారు. ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ ఉన్న జైలుకే క్రిష్ణవేణి వెళ్లాల్సివచ్చింది. అయితే క్రిష్ణవేణి అరెస్టు ఎపిసోడులో టీడీపీ సోషల్ మీడియా తీరుపై చర్చ జరుగుతోంది. క్రిష్ణవేణిని అరెస్టు చేసేవరకు ప్రభుత్వంపై టీడీపీ సోషల్ సైనికులు యుద్ధం చేయడంతో ఆఘమేఘాలపై క్రిష్ణవేణిని అరెస్టు చేసేందుకు పోలీసులు కదిలారంటున్నారు. ఈ ఘటన ద్వారా వైసీపీ సోషల్ మీడియాపై టీడీపీ సోషల్ మీడియా పైచేయి సాధించిందని అంటున్నారు.