వైసీపీ ఓటు బ్యాంక్ కి షర్మిల తూట్లు
రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తూంటాయి. వాటిని ఎంత జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నా చాలా సార్లు జారిపోతూంటాయి.
By: Satya P | 30 Aug 2025 12:00 PM ISTరాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తూంటాయి. వాటిని ఎంత జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నా చాలా సార్లు జారిపోతూంటాయి. అయితే కోరి వాటిని పాడుచేసుకోకూడదని అంటారు ఇక రాజకీయాలకు అంతిమ లక్ష్యం అధికారం. అలా అధికారంలోకి వచ్చాక రాజకీయంగా మరింత సుస్థిరత సాధించేందుకు పది కాలాల పాటు నిలిచేందుకు పధక రచన చేస్తూంటారు. వైసీపీకి ఆ చాన్స్ 2019లో వచ్చింది. అయితే వచ్చిన చాన్స్ ని వైసీపీ ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
ఉమ్మడి నుంచి విడివడి :
వైఎస్సార్ కుటుంబం అంతా ఉమ్మడిగా అతి పెద్ద కాంగ్రెస్ మీద పోరాడింది. వైఎస్సార్ 2009లో మరణించడంతో గొప్ప అండను కోల్పోయిన ఆ కుటుంబం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ మీద పోరాడింది అంటే దాని వెనక ఐక్యంగా ఉన్న వైఎస్సార్ ఫ్యామిలీ అని చెప్పక తప్పదు అంటారు. గాంధీలతో నేరుగా ఢీ కొట్టి సక్సెస్ అయిన చరిత్ర కూడా దేశ రాజకీయాల్లో పెద్దగా లేదు. కానీ ఆ ఫీట్ ని వైఎస్సార్ ఫ్యామిలీ సాధించింది అంటే దానికి కారణం కూడా ఉమ్మడి పోరాటమే అని విశ్లేషిస్తారు.
పవర్ తోనే పదనిసలు :
ఇక వైఎస్సార్ తరువాత ఆ కుటుంబానికి పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు, అలుపెరగకుండా చేసిన పోరాటానికి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి లభించింది. అలా వైఎస్సార్ రాజకీయ వారసుడిగా జగన్ అత్యున్నత పీఠం ఎక్కారు. ఆ సమయంలో కూడా కుటుంబం అంతా ఒక్కటిగానే ఉంది అయితే పవర్ లోకి వచ్చాకే పరిణామాలు అన్నీ జరిగాయా అన్న చర్చ ఉంది. పవర్ అంటే పదనిసలు పలికిస్తుంది అన్న మాట కూడా ఉంది. అలా చూస్తే కనుక వైసీపీ కూడా దానికి అతీతం కాదని ఆచరణలో రుజువు అయింది అని చెబుతారు
మరో పవర్ సెంటర్ గా ఆమె :
వైసీపీ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు షర్మిల. అలా అన్నతో పాటు అడుగులు వేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. వైసీపీ ఏకంగా మూడు విడతలలో 11 మందిని రాజ్యసభకు నామినేట్ చేసింది. అందులో ఏ ఒక్క పదవి అయినా షర్మిలకు ఇవ్వలేకపోయారా అన్నదైతే అంతటా ఉంది. అదే సమయంలో మరో పవర్ సెంటర్ గా ఆమె మారుతుందని ముందుగా ఊహించే అలా కట్టడి చేశారు అని అంటారు కానీ షర్మిల ప్రభావం వైసీపీలో ఉన్నప్పటి కంటే బయటకు వచ్చాకే ఎక్కువగా కనిపిస్తోంది అని అంటున్నారు.
చెల్లెమ్మతో చికాకే :
తాను గెలవకపోయినా ఫర్వాలేదు వైసీపీ ఓడాలి అన్న పట్టుదలతో 2024 ఎన్నికల్లో షర్మిల పనిచేశారు అని చెబుతారు ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి కూడా అలాగే లభించింది. దాంతో ఆమె రాజకీయ చెలగాటం ముందు వైసీపీ విలవిలలాడిపోయింది. ఏకంగా వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ జిల్లాలు దెబ్బకు కుదేల్ అయ్యాయి. ఆఖరికి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా వైసీపీకి దక్కలేదు. దాంతో ఆ పార్టీకి చెల్లెమ్మ చేసిన చేటు ఎంతో అర్ధమయ్యేసరికి పుణ్య కాలం ఇట్టే గడచిపోయింది.
ఆ ప్రచారంతో ముప్పేనా :
ఇక వైసీపీని ఫుల్ గా టార్గెట్ చేస్తూ షర్మిల ఎక్కుబెడుతున్న బాణాలు ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఆమె సంధిస్తున్న ప్రశ్నలకు జవాబులు వైసీపీ వద్ద లేవా లేక చెప్పలేకపోతున్నారా తెలియడం లేదు కానీ అవి మాత్రం జనాలలో చర్చకు వస్తున్నాయి. వైఎస్సార్ వారసుడిగా ఉంటూ జగన్ బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని ఆమె ఎండగడుతున్నారు. అక్రమ పొత్తులు అంటున్నారు. చీకటి స్నేహం అంటున్నారు. బీజేపీకి ఆర్ ఎస్ ఎస్ కి వైసీపీ మద్దతు ఇవ్వడమేంటని సూటిగా నిలదీస్తున్నారు ఇవన్నీ ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ కి తూట్లు పొడిచేవే అంటున్నారు.
నిజానికి ఈ ప్రశ్నలు కూటమి వేయలేదు. వారు కూడా బీజేపీతోనే ఉన్నారు కాబట్టి. ఇక కాంగ్రెస్ లో ఏ నేత ఉండి వేసినా వాటికి అంత ఫోకస్ కానీ ప్రచారం కానీ దక్కకపోవచ్చు. కానీ షర్మిల ఆ ప్లేస్ లో ఉండి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు దానికి జవాబు చెప్పలేక వైసీపీ కార్నర్ అవుతోంది. ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి వ్యతిరేకమైనదే. షర్మిల సైతం ఆ ఓటు బ్యాంక్ ని తిరిగి కాంగ్రెస్ వైపు లాగేందుకు జగన్ ని వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. దాంతో వైసీపీకి టీడీపీతో పోరు కంటే చెల్లెమ్మతో చికాకులే ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు.
