భీమిలికి అనూష.. విజయనగరం జడ్పీ అభ్యర్థి ఎవరు?
విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి కారణమైన జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది.
By: Tupaki Desk | 22 Sept 2026 12:00 AM ISTవిజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి కారణమైన జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో తన కుమార్తె బొత్స అనూష జడ్పీ చైర్ పర్సన్ గా తలపడతారని సీనియర్ నేత బొత్స గతంలో ప్రకటించారు. అయితే ఆయన ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబంలోను, జిల్లా పార్టీలో ముసలం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాను పదవీలో ఉండగా, బొత్స తన కుమార్తెను ఎంపిక చేశారంటూ అసంతృప్తి చెందిన ప్రస్తుత జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే టీడీపీలో చేరారు. ఇక చిన్నశ్రీను రాజీనామాతో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన బొత్స అనూషను అధిష్టానం పక్కజిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది.
బొత్స అనూషను అనూహ్యంగా భీమిలి ఇంచార్జిగా నియమించడంతో విజయనగరం జడ్పీ చైర్మను అభ్యర్థిగా కొత్త వారిని తెరపైకి తెస్తారని ప్రచారం జరుగుతోంది. నిజానికి విజయనగరం జడ్పీ పీఠం గత 25 ఏళ్లలో 20 ఏళ్లు బొత్స గుప్పిట్లోనే ఉందని చెబుతున్నారు. తొలుత 2001లో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి చైర్ పర్సన్ గా ఎన్నిక అవగా, ఆమె తర్వాత అదే కుటుంబానికి చెందిన బడుకొండ అప్పలనాయుడు, ఆయన తర్వాత బొత్స అనుచరుడు బెల్లాన చంద్రశేఖర్ చైర్మన్లుగా వ్యవహరించారు. ఇలా ఆ పీఠంపై ఎవరు ఉన్నా, తెర వెనుక ప్రస్తుత చైర్మన్ చిన్న శ్రీను చక్రం తిప్పేవారని చెబుతున్నారు. ఇక 2014-19 మధ్య మినహాయిస్తే 2001 నుంచి ఇప్పటివరకు విజయనగరం జడ్పీపై బొత్స, ఆయన మేనల్లుడు చిన్న శ్రీను ఆధిపత్యమే ఉండేది. అయితే ఈ సారి తన కుమార్తె సిరి సహస్రను చైర్ పర్సన్ గా చూడాలని చిన్నశ్రీను భావించగా, బొత్స తన కుమార్తె పేరు ప్రకటించడంతో ఆయన షాక్ కు గురయ్యారని అంటున్నారు. ఈ క్రమంలోనే బొత్సతో విభేదించి చిన్నశ్రీను సొంత రాజకీయ అజెండా ఎంచుకున్నారని చెబుతున్నారు.
ఈ పరిణామాలతో చిన్నశ్రీను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోగా, ఆయన ఇన్నాళ్లు చూసిన భీమిలి ఇంచార్జి బాధ్యతలను బొత్స కుమార్తె అనూషకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇది కూడా సీనియర్ నేత బొత్స ఊహించలేదని చెబుతున్నారు. తన కుటుంబం చేతుల్లో జడ్పీ పెట్టుకోవాలని ఆశించిన బొత్సకు ఈ విషయంలో అధిష్టానం ఝలక్ ఇచ్చినట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బొత్స కుమార్తెకు భీమిలి ఇంచార్జి పదవి ఇచ్చినందున జడ్పీ చైర్ పర్సన్ గా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీలోని ఒక వర్గం వారు కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే జిల్లావరకు వైసీపీలో అన్నీతానై వ్యవహరిస్తున్న బొత్స ఈ డిమాండ్ కు అంగీకరిస్తారా? అన్నదే ఆసక్తి రేపుతోంది.
మరోవైపు అనూషను భీమిలి ఇంచార్జిగా నియమించినందున ఆమె స్థానంలో జడ్పీ చైర్ పర్సన్ గా అదే కుటుంబంలో మరెవరినైనా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయా అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. లేకపోతే పార్టీలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇస్తారా? అనేది కూడా చూడాల్సివుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా వైసీపీ రాజకీయాలు వరకు చూస్తే బొత్స మాటే ఫైనల్. అయితే ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్ల వల్ల జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కొత్తవారికి అవకాశం ఇస్తారా? లేక ఒంటిచేత్తో పోరాటం చేసి తన కుటుంబాన్ని గెలిపించుకునేలా సొంతంలోనే ఇంకొకరిని తెరపైకి తెస్తారా? అన్నది చూడాల్సివుందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుత కూటమి ప్రభుత్వ జోరులో ఆర్థికంగా తట్టుకోవడం కష్టమనే భావన ఎక్కువగా ఉంది. దీంతో బొత్స కుటుంబానికే జడ్పీ పీఠం వదిలేసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అదే జరిగితే బొత్స సోదరుల పిల్లల్లో వేరొకరిని ముందుకు తీసుకువస్తారా? లేదంటే ముందుగా ప్రకటించినట్లు అనూష అభ్యర్థిత్వంతోనే ముందుకువెళతారా? అన్నది చూడాల్సివుందని అంటున్నారు.
