అయితే.. పోరు లేకుంటే బేజారు.. విశాఖపై వైసీపీ వ్యూహం ఇదే..!
విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌పై వైసీపీ రెండు వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అయితే.. పట్టు పట్టి సాధించుకోవడం.
By: Tupaki Desk | 7 April 2025 4:45 AM ISTవిశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌పై వైసీపీ రెండు వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అయితే.. పట్టు పట్టి సాధించుకోవడం. లేదంటే వదిలేసుకుని.. ప్రజల మధ్యకు వెళ్లడం అనే రెండు లైన్లపై వైసీపీ ప్రయాణం చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి పెను పరీక్షలే పెడుతోంది. గ్రేటర్ సీటును 2021-22 మధ్య చాలా శ్రమకోర్చి వైసీపీ దక్కించుకున్న విషయం తెలిసిందే.
అప్పట్లో విజయసాయిరెడ్డి పాదయాత్ర చేసి మరీ.. ఇక్కడ వైసీపీ మునిసిపాలిటీలో పాగా వేసేలా వ్యవహ రించారు. అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్టుగా.. వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. సహజంగానే స్థానికంలో కూటమి పార్టీలు పాగా వేయడం ప్రారంభించాయి. వీటిలో కీలకమైన మూడు లక్ష్యాలు పెట్టుకున్నాయి. గుంటూరు, విజయవాడ, విశాఖ కార్పొరేషన్లను కూటమి గెలుచుకునేం దుకు పట్టుదలతో ఉంది. గుంటూరు, విజయవాడ పరిస్థితి రాజకీయంగా వివాదం అయ్యే అవకాశం ఉందని గ్రహించారు.
దీంతో ఇప్పుడు విశాఖ నుంచి నరుక్కొస్తున్నారు. ఈ క్రమంలోనే 20మంది వరకు వైసీపీ కార్పొరేటర్లను విశాకలో పార్టీ నాయకులు తమ శిబిరానికి చేర్చుకున్నారు. అనంతరం.. మేయర్ హరికుమారిపై అవిశ్వాసం ప్రకటించారు. అయితే.. దీనికి ఎక్కువ సమయం పడుతుండడంతో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు.. కన్నబాబు వైసీపీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయనకు కీలక నాయకులు సహకరించడం లేదన్నది వాస్తవం. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పత్తా లేకుండా పోయారు.
అదేవిధంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా..తనకేమీ పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇత ర నాయకులు కూడా.. ఇలానే ఉండడంతో కన్నబాబు మొత్తం వ్యవహారాన్ని భుజాలపై వేసుకున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ కార్పొరేటర్లకు భీమిలిలో క్యాంపు ఏర్పాటు చేశారు. అవిశ్వాసం నేపథ్యంలో వారిని అవసరమైతే.. ఈ నెల 19వరకు విదేశాలకు తీసుకెళ్లేందుకు పాస్‌పోర్టులు తీసుకున్నారు. కానీ, వైసీపీ మాత్రం ఈ తరహా దూకుడు ప్రయత్నాలు చేయలేక పోవడంతోపాటు.. కూటమి నుంచి ఎదురవుతున్న రాజకీయాలకు సరైన దిశగా చెక్ పెట్టలేక పోతుండడం గమనార్హం. దీంతో అయితే.. పట్టు బిగించడం.. లేకపోతే.. వదిలేసుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్లాలన్న నిర్ణయంతో ఉండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
