వైసీపీకి విశాఖ ఒక ప్రయోగ శాల
ఇక ఆ తరువాత జరిగిన మేయర్ ఎన్నికల్లో అధికారం ఉంది కాబట్టి వైసీపీ గెలిచింది. కానీ టీడీపీ 30 మంది కార్పోరేటర్లను గెలిపించుకుని తన సత్తా ఆ సమయంలోనూ చాటుకుంది.
By: Tupaki Desk | 11 Jun 2025 11:00 AM ISTవైసీపీకి విశాఖ ఒక ప్రయోగ శాల గా మారిందా అంటే అదే నిజం అంటున్నారు. ఆ పార్టీ పెట్టాక ఎంతో మంది నేతలు విశాఖ రాజకీయాలను చూసారు. కానీ ఎవరూ విశాఖలో రాజకీయంగా వైసీపీకి వైభవం తీసుకుని రాలేకపోయారు. ఆఖరుకు 2019లో వచ్చిన వైసీపీ రాజకీయ సునామీ కూడా విశాఖలో టీడీపీ కోటను కొట్టలేకపోయింది. నాలుగు దిక్కులా సైకిల్ జోరు కనిపించింది.
ఇక ఆ తరువాత జరిగిన మేయర్ ఎన్నికల్లో అధికారం ఉంది కాబట్టి వైసీపీ గెలిచింది. కానీ టీడీపీ 30 మంది కార్పోరేటర్లను గెలిపించుకుని తన సత్తా ఆ సమయంలోనూ చాటుకుంది. ఇక లేటెస్ట్ గా విశాఖ మేయర్ పీఠం కూడా టీడీపీ చేతిలోకి వెళ్ళిపోయింది ఇదిలా ఉంటే విశాఖలో టీడీపీకి జనసేనకు బీజేపీకి కూడా సొంతంగా బలాలు ఉన్నాయి.
ఈ మూడు పార్టీలు కూటమి కట్టడంతో మరింత బలంగా మారాయి. నాయకులకు క్యాడర్ కి లోటు లేదు. దాంతో విశాఖలో వైసీపీ ఇబ్బందులు పడుతోంది. అయితే శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖ రాజకీయాలను తన వంతుగా చూస్తున్నారు. అలాగే రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు విశాఖ పార్లమెంటరీ పార్టీ పరిశీలకునిగా సీనియర్ నేత కదిరి బాబూరావుని వైసీపీ నియమించింది. మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు విశాఖలో ఉన్నారు.
కానీ ఇపుడు కొత్తగా పాయకరావుపేట నుంచి రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు విశాఖ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. ఆయన వైసీపీ తరఫున ఇక మీదట దూకుడు చేయనున్నారు. బాబూరావు విశాఖలోనే గతంలో పనిచేశారు. ఆయన జిల్లా పరిషత్ లో సీఈవోగా పనిచేస్తూ రాజకీయాల్లోకి 2009లో ఎంట్రీ ఇచ్చి తొలిసారి కాంగ్రెస్ తరఫున పాయకరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు.
అలా ఆయనకు విశాఖతో మంచి అనుబంధం ఉంది. పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశాఖలో ఆయనకంటూ అంగబలం అర్ధబలం ఉండడం లోకల్ ముద్ర ఉండడంతో ఆయనను ముందు పెట్టి రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
బాబురావు పెద్ద మనిషిగా ఉంటూ తనదైన రాజకీయ విమర్శలు విశ్లేషణలు చేస్తారు. ఆయనకు విశాఖ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరిక బహుశా ఎక్కడో ఉందని అంటున్నారు. విశాఖ నుంచి 2029 ఎన్నికల్లో ఎంపీగా బాబూరావుని దింపుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా బాబూరావు వైసీపీకి మరో బలంగా మారి టీడీపీ కంచుకోటలను బద్ధలు కొడతారని వైసీపీ హై కమాండ్ ఆశిస్తోంది.
మరి ఆ విధంగా జరుగుతుందా లేదా అన్నది చూడాలి ఏది ఏమైనా వైసీపీ రాజకీయంగా ఎందరినో నేతలను తీసుకుని వచ్చి విశాఖలో ప్రయోగాలు చేస్తోంది. కానీ వైసీపీకి మాత్రం రాజకీయ అదృష్టం అయితే చిక్కడం లేదు అని అంటున్నారు. చూడాలి మరి దశ ఎపుడు ఏ రూపంలో ఎవరి రూపంలో దక్కుతుందో.