Begin typing your search above and press return to search.

లాస్ట్ బాల్ అంటూ వైసీపీ విప్ అస్త్రం

అయితే వైసీపీ విప్ జారీ చేసినా ఎంత మంది దానిని గౌరవించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకుండా ఉంటారు అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   16 April 2025 5:46 PM IST
లాస్ట్ బాల్ అంటూ వైసీపీ విప్ అస్త్రం
X

విశాఖ మేయర్ సీటుని ఏదో అద్భుతం జరిగితే తప్ప వైసీపీ నిలబెట్టుకోలేదు అన్నది లెక్కలతో సహా తేలిపోయింది. అంతా అయిపోయాక వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి కూటమి ఫిరాయింపులకు పాల్పడుతోంది అని అంటున్నారు. 1995 నాటి వైస్రాయ్ హొటల్ ఉదంతం మాదిరిగా మళ్లీ చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.

విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాధ్ అయితే కూటమి మేయర్ పదవి కోస్దం నీతి బాహ్యమైన చర్యలకు దిగుతోంది అని విమర్శించారు. బలం లేకపోయినా కూటమి వైసీపీ మేయర్ ని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను దించేయాలని చూడడం దారుణం అని నిప్పులు చెరిగారు.

జనరల్ సీటుని వైసీపీ అధినేత జగన్ ఒక బీసీ మహిళకు ఇస్తే ఓర్వలేని కూటమి నేతలు ఆమెని ఓడించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పదకొండు నెలల అధికారం కోసం ఇంతలా తెగిస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు.

పూర్తిగా అడ్డదోవలో విశాఖ మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుట్ర పన్నిందని కూడా అన్నారు. వైసీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 58 మంది స‌భ్యుల‌కు విప్ కూడా జారీ చేస్తున్నామని గుడివాడ ప్రకటించారు. ఈనెల 19న నిర్వ‌హించ‌నున్న అవిశ్వాస తీర్మాన కార్య‌క్ర‌మానికి కూడా వెళ్ల‌కూడ‌ద‌ని పార్టీ నిర్ణ‌యించిందని చెప్పారు.

ఇక పార్టీ విప్ ధిక్క‌రించి హాజ‌రైన వారిపై చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌లు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పార్టీ అధికారంలో ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా ప్ర‌తిప‌క్ష పార్టీ మీద దాడులు చేసి బెదిరించి ప‌ద‌వులు చేజిక్కించుకోవాల‌ని చూస్తున్న అధికార పార్టీ ఆగ‌డాల‌ను కూడా విశాఖ ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నారుని అన్నారు. వైసీపీకి చెందిన కార్పొరేట‌ర్ల‌కు విప్ జారీ చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

అయితే వైసీపీ విప్ జారీ చేసినా ఎంత మంది దానిని గౌరవించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకుండా ఉంటారు అన్న చర్చ సాగుతోంది. కేవలం పదకొండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇక విప్ ని ధిక్కరించారని అధికారులకే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వారు వెంటనే చర్యలు తీసుకుంటారా అన్నది కూడా మరో చర్చ.

ఈ లోగా పదవీకాలం పూర్తి అవుతుంది. మరి విప్ అన్న వైసీపీ అస్త్రం ఏ మేరకు పనిచేస్తుంది అన్నది చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే వైసీపీ విశాఖ మేయర్ విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసింది అని అంటున్నారు. బెంగళూరు క్యాంపులు విదేశాలలో క్యాంపులు పెట్టినా తమ వద్ద ఉన్న వారిని రక్షించుకోలేకపోయారు అని అంటున్నారు. విప్ జారీ చేయడం అన్నది వైసీపీ చేతిలో లాస్ట్ బాల్ గానే ఉందని అంటున్నారు. ఇక వైసీపీ అవిశ్వాస తీర్మానానికి వెళ్ళకపోవడం అన్నది చూస్తే కనుక టీడీపీ కూటమికి మేయర్ పదవి దక్కడం లాంచనం అని తేలుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.