చర్యకు ప్రతిచర్య.. వైసీపీలో మళ్లీ అదే వాయిస్..
కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని వైసీపీ లక్ష్యంగా చేసుకున్నట్లు ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 15 July 2025 11:11 PM ISTకూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని వైసీపీ లక్ష్యంగా చేసుకున్నట్లు ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం తమను వేధిస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రకటిస్తూ కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తున్నారు. అయితే ఈ క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలే విమర్శలకు తావిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన దాడి, దానికి ముందు ఆయన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపాయి. ఇందులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయనే అభిప్రాయమే ఎక్కువగా వ్యాపించింది. అయితే తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. పోలీసులు తమ ఫిర్యాదులను లెక్క చేయడం లేదన్న ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తమ ప్రభుత్వం వస్తే సంగతి తేల్చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో సౌమ్యుడిగా పేరున్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తనలో రెండో యాంగిల్ ఉందని బయటపెట్టారు. గుంటూరు పోలీసులు తమ ఫిర్యాదులను తీసుకోవడం లేదన్న కారణంగా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన మోదుగుల పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు.. చూస్తూ ఉన్నారని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మోదుగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రెచ్చిపోండి, మీరు ఎంత రెచ్చిపోవాలని అనుకుంటే అంతగా రెచ్చిపోండి. ఎందుకంటే జగన్ అధికారంలోకి వస్తే ఏకే - 47లు, తొపాకులు, లాఠీలు బలంగా పనిచేస్తాయి’’ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మీ చర్యలకు ప్రతిచర్య ఉంటుంది. తప్పించుకోలేరు అంటూ విరుచుకుపడ్డారు.
సోషల్ మీడియాలో తమపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారిపై తాము కేసు పెడితే పోలీసులు స్వీకరించడం లేదని మాజీ ఎంపీ మోదుగుల ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పోలీసు పాలన నడుస్తోందని విమర్శించారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉండాలా? వద్దా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘రాబోయేది జగన్ ప్రభుత్వమే, మాకు అన్నీ గుర్తే ఉంటాయి. మేం కూడా రాసుకుంటున్నాం. ఆరెంజ్, గ్రీన్ డైరీలు స్టార్ట్ చేశాం’’ అని వేణుగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.
ఇక మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. వైసీపీ నేతలు అంతా ఒకే ఆలోచనతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. మరోవైపు వైసీపీ నేతలు అడ్డు, అదుపు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, ఇప్పుడు కూడా వారు మారడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మాటలను ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు.
