యూరియా కొరతపై వైసీపీ ఆందోళన.. ఇది తగిన సమయమేనా?
ఏపీలో యూరియా సమస్యపై ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 9న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ధర్నాలు చేయాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు.
By: Tupaki Desk | 7 Sept 2025 2:00 PM ISTఏపీలో యూరియా సమస్యపై ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 9న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ధర్నాలు చేయాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. అయితే వైసీపీ ధర్నాలకు రైతుల నుంచి స్పందన ఉంటుందా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల సమస్య అంతగా లేకపోవడమే అంటున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు ఈ సమస్య తీవ్రంగా ఉండేదని, కానీ, కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి భారీగా యూరియా తెప్పించిందని అంటున్నారు. యూరియా సరఫరా సజావుగా సాగుతున్న సమయంలో ఆందోళన చేయడం వల్ల వైసీపీకి ఏ ప్రయోజనం ఒనగూరుతుందో చూడాల్సివుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి ఏపీలో కొద్ది రోజుల క్రితం వరకు యూరియా కొరత తీవ్రంగా ఉండేది. ఆధార్ కార్డుపై ఒక బస్తా మాత్రమే సరఫరా చేసే వారు. అదే సమయంలో వర్షాలు ఆలస్యం అవడం, ఆ తర్వాత అదునులో యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటలపై రైతుల్లో ఆందోళన వ్యక్తమైందని అంటున్నారు. ఆ సమయంలో వైసీపీ బయటకు వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే ఆ పార్టీకి రాజకీయంగా మైలేజ్ పెరిగేదన్న వాదన వినిపిస్తోంది. అయితే నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లు వైసీపీ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వల్ల రాజకీయంగా పైచేయి సాధించాల్సిన అవకాశాలను చేజేతులా వదులుకున్నట్లు అవుతోందని అంటున్నారు.
ఈ నెల 9న ఆందోళన చేయాలని పిలుపునిచ్చే బదులు, సమస్య ఉన్నప్పుడే ఇలా స్పందిస్తే రైతుల నుంచి సానుకూల స్పందన వచ్చేది అని అంటున్నారు. సమస్య పరిష్కారం అయ్యాక తీరిగ్గా ధర్నాలు అంటే పార్టీ కార్యకర్తలు తప్ప, రైతులు ఎవరూ రారని అంటున్నారు. తొలి నుంచి పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో ఇదేవిధమైన వ్యూహాత్మక తప్పిదాలు జరుగుతున్నాయని కార్యకర్తలు చెబుతున్నారు. యూరియా కొరత ఉన్నప్పుడే పార్టీ నేతలు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగితే రైతుల సమస్యపై పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లు చెప్పుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ధర్నాలు చేయడం వల్ల రాజకీయ ప్రయోజనాలే తప్ప రైతులకు చేసే మేలు ఏమీ కనిపించడం లేదని పార్టీ కేడర్ వాపోతున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా యూరియా ఉందని, ధర్నా చేయాల్సిన మంగళవారం నాటికి రాష్ట్రంలో ప్రతి దుకాణంలో యూరియా లభిస్తుందని అలాంటి సమయంలో ధర్నా చేయడం వల్ల అధికార పార్టీ నుంచి ప్రతి దాడి ఎదుర్కొవాల్సవుంటుందని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ ఇలాంటి వ్యూహాత్మకి తప్పిదాల వల్ల రాజకీయంగా నష్టపోతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. గతంలో బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతుగా ధర్నా చేసినప్పుడు, పొదిలిలో పొగాకు రైతు కోసం పోరాడిన సందర్భంగా పార్టీ ఆశించిన రాజకీయ ప్రయోజనాలు కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందని అంటున్నారు. బంగారుపాళ్యంలో మామిడి కాయలను రోడ్డుపై పారవేయడం, పొదిలిలో పొగాకు బస్తాలను తొక్కి నాశనం చేయడం వంటివి సంఘటనలను ప్రత్యర్థులు బాగా వాడుకున్నారని, సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా పార్టీకి నష్టం చేశారని అంటున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో యూరియా పుష్కలంగా ఉండగా, ధర్నా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో? అధిష్ఠానమే నిర్ణయించుకోవాలని అంటున్నారు.
