Begin typing your search above and press return to search.

కూటమి టార్గెట్ గా వైసీపీ కొత్త పోరు!

యువతను చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మోసం చేశారు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 10:00 PM IST
కూటమి టార్గెట్ గా వైసీపీ కొత్త పోరు!
X

ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమిని వైసీపీ టార్గెట్ చేసింది. ఇప్పటికే ఆందోళనలను మొదలెట్టిన వైసీపీ ఈసారి యువత కోసం ఆందోళనలను చేపడుతోంది. ఏపీలో ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా యువతకు బాసటగా ఉంటూ జిల్లా కలెక్టరేట్లల వద్ద ఆందోళనలకు పిలుపు ఇచ్చింది.

గత ఏడాదిగా కూటమి పాలనలో నిరుద్యోగ భృతి ఇవ్వలేదని వైసీపీ ఆక్షేపిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు అయినా ఇస్తామని లేకపోతే నిరుద్యోగ భృతిగా నెలకు మూడు వేల రూపాయలు వంతున చెల్లిస్తామని కూటమి పెద్దలు హామీ ఇచ్చారని వైసీపీ గుర్తు చేస్తోంది. అయితే ఆ హామీని అమలు చేయకుండా ఏడాది గడిపేశారని నిందిస్తోంది. దీంతో ప్రతీ ఇంటికీ అక్షరాలా ముప్పై ఆరు వేల రూపాయల దాకా బాకీ పడిందని లెక్క చెబుతోంది.

అంతే కాదు చదువుకునే పిల్లలు ఉంటే కనుక వారికి స్కూల్ లో ఫీజులు కట్టుకోలేని స్థితిలో అమలు చేస్తామన్న ఫీజు రీ ఇంబర్స్ మెంట్ ని కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని దీంతో పేద విద్యార్ధులు వారి తల్లితండ్రులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని వైసీపీ పేర్కొంటోంది. చివరి ఏడాది ఫీజు బకాయిలు పేరుకుపోవడంతో సర్టిఫికేట్లు కూడా ఇవ్వకుండా యాజమాన్యాలు చేస్తూంటే కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది.

అదే విధంగా చూస్తే యువతకు ఎన్నో చేస్తామని చెప్పి ఏమీ చేయకపోవడమేంటి అని వైసీపీ ప్రశ్నిస్తోంది. అంతే కాదు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అమలు చేశారని నిలదీస్తోంది. దీంతో ఈసారి యువత సమస్యల మీద వైసీపీ ఆందోళన చేపడుతోంది. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షులు అన్ని జిల్లాలలో యువత పోరు మీద పోస్టర్లు ఆవిష్కరించారు. ఇక ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల వద్ద కలెక్టరేట్ ఆఫీసుల ఎదురుగా ఈ ఆందోళనలు చేపడతారు అని చెబుతున్నారు.

యువతను చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మోసం చేశారు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఈ మధ్యనే తల్లికి వందనం కార్యక్రమం కింద తల్లుల ఖాతాలో నిధులు వేసింది కూటమి ప్రభుత్వం దానికి ఏకంగా పదివేల కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది. మరి నిరుద్యోగ భృతి అన్న హామీని ఇచ్చారు కానీ అమలు చేయడం కష్టమే అని అంటున్నారు.

ఏపీలో ఒక లెక్క ప్రకారం చూస్తే నిరుద్యోగ యువత ఆన్ రికార్డుగా రాష్ట్ర ఉపాధి కేంద్రాలలో 6.16 లక్షల మంది నమోదైన నిరుద్యోగ యువత ఉన్నారని అంటున్నారు. అంతే కాదు రాష్ట్రంలో యువత నిరుద్యోగ రేటు 17.5 శాతంగా ఉంది అని అంటున్నారు.

మరి ఇంత పెద్ద ఎత్తున అధికారిక లెక్క ఉంది. ఇది కాకుండా బయట మరిన్ని లక్షలుగా ఉంది. ఇంతమందికి నెలకు మూడు వేల రూపాయలు వంతున భృతి ఇవ్వాలంటే అయ్యే పని కాదు. దాంతో ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి. అయితే ఈ పాయింట్ ని పట్టుకుని వైసీపీ కూటమి సర్కార్ ని నిలదీయాలని చూస్తోంది. మరి వైసీపీ ఆందోళన ఏ మేరకు సక్సెస్ అవుతుంది, యువత ఎంతమేరకు కలసి వస్తారు అన్నది చూడాల్సి ఉంది.