టార్గెట్ మార్చుకున్న వైసీపీ.. లోకేశ్ చుట్టూనే రాజకీయం! పక్కా ప్లానింగ్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?
ఏపీ రాజకీయాల్లో మంత్రి నారా లోకేశ్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కుమారుడిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేశ్‌కు అధికార పార్టీలో సహజంగానే ప్రాధాన్యం ఉంటుంది.
By: Tupaki Political Desk | 29 July 2026 3:43 PM ISTఏపీ రాజకీయాల్లో మంత్రి నారా లోకేశ్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కుమారుడిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేశ్‌కు అధికార పార్టీలో సహజంగానే ప్రాధాన్యం ఉంటుంది. కానీ, విపక్షం వైసీపీ కూడా ఇప్పుడు లోకేశ్‌ను టార్గెట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వంలో నెంబర్ వన్, టూ స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను విడిచిపెట్టిన విపక్షం వైసీపీ, కొద్దిరోజులుగా ‘ఆపరేషన్ లోకేశ్’ అన్నట్టుగానే పావులు కదుపుతోందని అంటున్నారు. తాజాగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు చేస్తున్న వైసీపీ నేతలు మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం తరఫున ఏం జరిగినా లోకేశ్‌నే టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలో కొద్దిరోజులుగా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ప్రధానంగా మంత్రి లోకేశ్ కేంద్రంగా కొనసాగుతున్న పరిణామాలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన తర్వాత ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో లోకేశ్ ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోయిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక విధులకే ఎక్కువగా పరిమితమవుతుండగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తను చూస్తున్న శాఖలతోపాటు తన దృష్టికి వచ్చిన పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదే సమయంలో మంత్రి లోకేశ్ మాత్రం ఇటు ప్రభుత్వ పాలనా వ్యవహారాలతోపాటు పెట్టుబడులు, పరిశ్రమలకు భూ కేటాయింపులు, రాజకీయంగా పార్టీ వ్యవహారాలు, కూటమి సమన్వయంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎక్కువగా అధికారిక కార్యక్రమాలకే పరిమితమవుతుండటం, లోకేశ్ మాత్రం భిన్నంగా రాజకీయ వ్యవహారాలతో దూసుకెళ్తుండటం వల్ల విపక్షం వైసీపీ తన టార్గెట్ మార్చిందని అంటున్నారు. గతంలో లోకేశ్ వల్ల తమకు పెద్దగా సమస్య ఉండదని భావించిన ఆ పార్టీ, ఇప్పుడు లోకేశ్ ప్రజల్లోకి వెళితే తమకు కష్టమనే అంచనాకు వస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగానే లోకేశ్‌ను టార్గెట్ చేయడంతోపాటు ఆయన కారణంగా ప్రభుత్వంలో అవకతవకలు, అవినీతి జరుగుతోందని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోందని అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే మెగా డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.
డీఎస్సీ అభ్యర్థుల సమస్యలతో నిమిత్తం లేకుండా, తాము చెప్పాలనుకున్నది చెప్పడం ద్వారా ప్రజల్లో లోకేశ్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించడమే వైసీపీ అసలు వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి భవిష్యత్తులో లోకేశ్ రూపంలో ఎదురయ్యే సవాల్‌కు ముందుగానే చెక్ పెట్టొచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న లోకేశ్ రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలను పూర్తిస్థాయిలో చేపట్టడంతోపాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని, దీంతో లోకేశ్ పై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీలోని ఎమ్మెల్యే స్థాయి నేతల వరకు అందరూ ఎక్కువగా లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారని చెబుతున్నారు.
