జగన్ ఇలానే ఉంటే.. అవీ పోతాయ్.. !
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ పోయింది. పలు మునిసిపాలిటీలు కూడా.. వైసీపీ గడప దాటాయి.
By: Tupaki Desk | 20 April 2025 7:00 PM ISTగ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ పోయింది. పలు మునిసిపాలిటీలు కూడా.. వైసీపీ గడప దాటాయి. ఇక, ఇప్పుడు కీలకమైన విజయవాడ, గుంటూరు నగర పాలక సంస్థలు కూటమి టార్గెట్‌లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఎలా వాటిని కాపాడుకుంటారు? అనేది వైసీపీలో చర్చ. సాధారణంగా చేతులు కాలాకే.. ఆకులు పట్టుకుంటున్న చందంగా జగన్ వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తాజాగా కూడా.. రుజువైంది. విశాఖ విషయంలో అంతా అయిపోయాక పోస్టులు పెట్టారు.
ఈ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లయినా వైసీపీ నిలబెట్టుకుంటుందా? లేక చోద్యం చూ స్తుందా? అనేది ప్రశ్న. విజయవాడ విషయంలో కొంత ఫర్వాలేదని పార్టీ భావిస్తోంది. అంతా మనోళ్లేనని.. పైగాతాడేపల్లి పక్కనే ఉందని చెబుతున్నారు. ఏం జరిగినా వెంటనే స్పందించేందుకు అవకాశం ఉందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. కానీ.. వాస్తవం వేరుగా ఉంది. మేయర్ నుంచి కార్పొరేటర్ల వరకు.. ఎమ్మెల్యేల కనుసన్నల్లోకి వెళ్లిపోయారు.
ఫలితంగా..కీలక నిర్ణయాల్లో వైసీపీ వ్యతిరేకించడం లేదు. పైగా..కౌన్సిల్‌లోనూ.. సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ.. టీడీపీ కార్పొరేటర్ల హవానే నడుస్తోంది.మరీముఖ్యంగా.. వార్డు స్థాయి రాజకీయాల్లో టీడీపీ నాయకులు ముందున్నారు. ఇక, గుంటూరు విషయానికి వస్తే.. కావటి మనోహర్‌నాయుడు రాజీనామా అనంతరం.. ఇప్పటి వరకు వైసీపీ ఆ విషయంపై దృష్టి పెట్టలేదు. కోరం గురించి కూడా.. పట్టించుకోలే దు. అంతేకాదు.. కావటి ప్లేస్‌లో ఎవరినీ నియమించలేదు.
ఇలా.. ఈ రెండు మునిసిపల్ కార్పొరేషన్లు కూడా.. తుమ్మితే ఊడే ముక్కు మాదిరిగా తయారయ్యాయన్న ది వాస్తవం. అయినప్పటకీ.. వైసీపీ అధినేత ఎక్కడా స్పందించడం లేదు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ మాజీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.. కేసులకు భయపడుతున్నారో.. లేక మరేమో తెలియదు కానీ.. బయటకు రావడం లేదు. దీంతో పశ్చిమలోని కార్పొరేటర్లు.. తెరచాటున టీడీపీ-బీజేపీ నాయకులు చెప్పినట్టే చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. సో.. ఎలా చూసుకున్నా.. ఈ రెండు కార్పొరేషన్ల విషయంలో ఇప్పటి నుంచే చక్రం తిప్పకపోతే.. విశాఖ పరిస్థితే వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
