Begin typing your search above and press return to search.

వైసీపీకి చిక్కని దక్కని సీటు...రీజన్ అదే ?

ఏపీలో 151 సీట్లు వైసీపీ గెలుచుకుంది. మిగిలినవి 24 సీట్లు. ఆ సీట్లలో కొన్ని 2014 లో గెలిచినా కనీసంగా ఒక పదిహేను సీట్లకు పైగా వైసీపీ తన రాజకీయ జీవితంలో గెలవనివి ఉన్నాయని లెక్క తీస్తున్నారు.

By:  Satya P   |   20 Jun 2026 8:57 AM IST
వైసీపీకి చిక్కని దక్కని సీటు...రీజన్ అదే ?
X

ఏపీలో 151 సీట్లు వైసీపీ గెలుచుకుంది. మిగిలినవి 24 సీట్లు. ఆ సీట్లలో కొన్ని 2014 లో గెలిచినా కనీసంగా ఒక పదిహేను సీట్లకు పైగా వైసీపీ తన రాజకీయ జీవితంలో గెలవనివి ఉన్నాయని లెక్క తీస్తున్నారు. ఇప్పటికి మూడు ఎన్నికలను చూసిన వైసీపీ ఆ సీట్లలో హ్యాట్రిక్ ఓటమిని అందుకుంది కానీ గెలుపు పిలుపు అయితే వినలేదు. అలాంటి సీట్లలో ఒకటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సీటు. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ స్ట్రాంగ్ గా ఉంటూ వస్తోంది. పార్టీ పెట్టాక ఓటమి పెద్దగా తెలియని సీటు ఇది. టీడీపీకి 23 సీట్లు వచ్చినా ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ఓటమి వరించినా కూడా ఇచ్చాపురం మాత్రం సైకిలెక్కుతూనే ఉంది.

ఫ్యాన్ తిరగదెందుకు :

ఇచ్చాపురంలో వైసీపీ ఫ్యాన్ ఎందుకు తిరగదు అంటే దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని అంటారు. 2014లో ఇక్కడ నుంచి నర్తు రామారావు వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో పిరియా సాయిరాజ్ వైసీపీ నుంచి పోటీ పడి ఓడితే 2024లో ఆయన సతీమణి పిరియా విజయ పోటీ చేసి ఓటమిని మూటకట్టుకున్నారు. ఇలా మూడు ఎన్నికలు ముగ్గురు నాయకులు మూడు ఓటములుగా వైసీపీ కధ సాగితే మూడు ఎన్నికల్లోనూ వైసీపీని ఓడించిన వారు బెందాళం అసోక్. ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచి రికార్డు క్రియేట్ చేశారు.

కొత్త ఇంచార్జితో అయినా :

ఇక వైసీపీ ఇచ్చాపురానికి కొత్త ఇంచార్జిగా శ్యాం ప్రసాద్ రెడ్డిని నియమించింది. ఆయన సామాజిక వర్గం అయిన రెడ్డికలు నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు అన్న కారణంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అయితే శ్యాం ప్రసాద్ రెడ్డి నియోజకవర్గానికి పెద్దగా పరిచయం లేని వారుగా అంటున్నారు. ఆయన ఇటీవల కాలంలో జోరు పెంచి పోరాటాలు చేస్తున్నా పార్టీ శ్రేణులే కాదు కీలక నాయకులు కూడా పెద్దగా సహకరించడం లేదు అని అంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నర్తు రామారావు టికెట్ ని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు పిరియా సాయిరాజ్ జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ కూడా నియోజకవర్గంలో బలంగా ఉన్నారు. వారిని కాదని శ్యాం ప్రసాదరెడ్డిని దించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని అంటున్నారు.

స్థిరమైన నాయకత్వం :

వైసీపీ ఈ నియోజకవర్గాన్ని ప్రయోగశాలగా మార్చింది అని అంటున్నారు. ప్రతీ సారీ ఒక కొత్త నేతను తీసుకుని రావడం వల్ల పాత నేతలు సహకరించడం లేదు, వర్గ పోరు పెరిగి పెద్దది అవుతోంది చివరికి ఈ అనైక్యత వైసీపీని ఓడిస్తోంది అని అంటున్నారు. ఇక ఇచ్చాపురంలో చూస్తే మూడు సార్లు గెలిచిన బెందాళం అశోక్ మీద జనంలో వ్యతిరేకత ఉంది కానీ దానిని సొమ్ము చేసుకునే అవకాశాన్ని మాత్రం వైసీపీ తీసుకోవడం లేదని అంటున్నారు. వర్గ పోరు వైసీపీని ఓటమికి గురి చేస్తోంది అని అంటున్నార్జు. మొత్తం రెండు లక్షల దాకా ఓటర్లు ఉంటే వైసీపీకి ప్రతీ ఎన్నికలోనూ 73 వేల దాకా ఓట్లు వస్తున్నాయి. అంటే 33 శాతం ఓటు షేర్ ఉంది అన్న మాట. అయినా సరే గెలవడం లేదు అంటే ఆలోచించుకోవాల్సిందే అని అంటున్నారు.

ఇదీ ఇచ్చాపురం తీరు :

ఇక ఇచ్చాపురం నియోజకవర్గం స్వరూపం చూస్తే కనుక ఏపీకి పూర్తిగా చివరాఖరున ఉన్న సీటు ఇది. ఒడిషాలోకి చొచ్చుకుని పోయిన ప్రాంతం ఇది. పశ్చిమ బెంగాల్‌ ఉత్తర ప్రదేశ్‌ , ఒడిశా , ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల నుంచి వచ్చే రహదారితో పాటు రైలు మార్గాలు అన్నీ కూడా ఇచ్చాపురం నియోజకవర్గం మీదుగానే సాగుతాయి. వీటి వల్ల కూడా ఇచ్చా పురానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఉందని చెబుతారు. ఇచ్చా పురాన్ని జయించాలి అన్న వైసీపీ ఇచ్చ నెరవేరాలీ అంటే కనుక కచ్చితంగా వైసీపీలో వర్గ పోరాటం ఆగిపోవాల్సిందే అని అంటున్నారు. అయితే అది సాధ్యమయ్యే పనేనా అన్నదే చర్చ.