Begin typing your search above and press return to search.

జగన్ ని కాచుకోలేకపోతున్నారా ?

వైసీపీ ఒక రాజకీయ పార్టీగా పదిహేనేళ్ళ వయసు కలిగినది. మూడు సార్వత్రిక ఎన్నికలను చూసింది. అందులో రెండు ఓడితే ఒకటి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి అధికారం దక్కింది.

By:  Tupaki Desk   |   24 April 2026 3:00 PM IST
జగన్ ని  కాచుకోలేకపోతున్నారా ?
X

వైసీపీ ఒక రాజకీయ పార్టీగా పదిహేనేళ్ళ వయసు కలిగినది. మూడు సార్వత్రిక ఎన్నికలను చూసింది. అందులో రెండు ఓడితే ఒకటి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి అధికారం దక్కింది. ఒక 2014లో ఓడినా విజయానికి దరిదాపులకు వచ్చింది. 2024లో అయితే భారీ ఓటమితో చతికిలపడింది. ఇక వైసీపీ ఒక రాజకీయ పార్టీగా సంస్థాగతంగా నిర్మాణం అయితే మిగిలిన పార్టీలకు భిన్నం. జగన్ అభిమాన గణమే వైసీపీకి అండ దండగా ఉంటారు. అదే సమయంలో వైసీపీకి గ్రౌండ్ లెవెల్ దాకా అభిమానులు కార్యకర్తలు ఉన్నారు అలాగే సీనియర్ నేతలకు కొదవ లేదు. ఇంత మంది బలం బలగం ఉన్నా వైసీపీకి లేనిది సరైన సమయానికి అవసరమైన వ్యూహాలు అని అంటున్నారు.

టీడీపీతో ఢీ కొడుతూ :

అవతల వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యూహాల పుట్ట. ఆ పార్టీ నాలుగు వైపుల నుంచి బాణాలు వేస్తుంది. వాటిని తట్టుకోవడంతోనే వైసీపీకి పుణ్య కాలం సరిపోతోంది. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా వైసీపీకి ఇదే ఇబ్బంది. నిజానికి విపక్షంలో ఉన్న పార్టీకి పూర్తి స్వేచ్చ ఉంటుంది. పారా హుషార్ అంటూ జెండా ఎగరేయాల్సిన పరిస్థితి. వైసీపీ మాత్రం అందుకు భిన్నం. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా రాళ్ళ దెబ్బలు తింటూ ఉంటుంది. ప్రత్యర్ధులు చేసే రాజకీయ విమర్శలకు జవాబు చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటుంది.

ఆది నుంచి అంతేనా :

ఇక వైసెపీ ఆవిర్భవించిన నాటి నుంచే డిఫెన్సివ్ మోడ్ లోనే సాగుతోంది. ఇతర పార్టీలు చేసే ఆరోపణలు విమర్శలకు ఆన్సర్ చేయడమే వైసీపీ పనిగా ఉంటుంది. పోనీ అక్కడైనా సరిగ్గా వ్యవహరిస్తోందా అంటే అదీ లేదు, తడబాట్లు పొరపాట్లు చేస్తూ పోతోంది. టీడీపీ పది గొంతులకతో పది రకాలుగా ప్రతీ రోజూ చేసే విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్లు అయితే పేలవంగా వస్తాయని అంటున్నారు. పైగా లేట్ గా రియాక్ట్ కావడం ఆ పార్టీకి మరో ఇబ్బంది కరమైన అంశంగా ఉంది.

టీడీపీతో విలవిల :

తెలుగుదేశం పార్టీకి అపర చాణక్యుడు లాంటి చంద్రబాబు నాయకుడు. ఆయన తనదైన వ్యూహాలతో వైసీపీని చక్రబంధం చేస్తున్నారు. దాంతో వైసీపీ ఆ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతోంది. తాజాగా కడప జిల్లాలో వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య మీద టీడీపీ టోటల్ గా వైసీపీని దోషిగా చేసి జనం ముందు పెట్టింది. సొంత పార్టీ వారినే చంపుకుంటున్నారు అని కూడా భారీ ఎత్తున విమర్శలు చేసింది. అయితే దీనికి కౌంటర్ చేయడంలో వైసీపీ వెరీ వీక్ అని తేలిపోతోంది. అనకాపల్లి సభలో కూడా చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీని ఏకంగా కిల్లర్ పార్టీగా అభివర్ణించారు. దాంతో కౌంటర్ చేయడానికి వచ్చిన వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ మీద విమర్శలు చేశారు కానీ అవి పెద్దగా పదునుగా లేవని అంటున్నారు. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా జగనే బాధ్యుడిని చేస్తారా అంటూ గుడివాడ ప్రశ్నించడం డిఫెన్స్ మోడ్ లోనే ఉందని అంటున్నారు.

ఇలాగైతే కష్టమే :

జగన్ ని ఒక పద్ధతి ప్రకారం టీడీపీ జనంలో పెట్టి నెగిటివ్ ఇమేజ్ ని బిల్డప్ చేస్తోంది అని వైసీపీ నేతలు బాధపడుతున్నారు జగన్ వ్యక్తిత్వం హననం చేస్తున్నారు అని కూడా అంటున్నారు. పార్టీ నేతల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం దాకా ప్రతీ రోజూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు అని బాధ పడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఆవేదనలకు నో చాన్స్. డిఫెన్స్ మోడ్ కాదు అఫెన్సివ్ గా ఉంటేనే ఎవరైనా నిలిచేది గెలిచేది. కానీ అదే వైసీపీకి వంటబట్టడం లేదని అంటున్నారు.

తన పాత్రను పోషించలేకపోతోందా :

ఈ రోజుకీ జగన్ లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు కానీ తండ్రి శవం ఉండగానే సీఎం సీటు కోసం సంతకాలు సేకరించారు అని కానీ బాబాయ్ హత్య కేసు కానీ తల్లీ చెల్లీ దూరం పెట్టారు అని కానీ ఇలా అనేక విషయాల్లో జవాబు చెప్పుకునే స్థీతిలోనే ఉంది. రాజకీయాల్లో జవాబు చెప్పడం ముఖ్యమే కాదు దాంతో పాటు ప్రత్యర్ధి శిబిరాన్ని కట్టడి చేయాలి. మహా మంత్రి తిమ్మరుసు చెప్పినట్లుగా పెద్ద గీత గీసి జనంలో ఎప్పటికప్పుడు కొత్త చర్చకు తెర లేపాలి. అధికార పార్టీ అంటే ఎన్నో బరువులు మోస్తూ ఉంటుంది. విపక్షంగా వైసీపీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పార్టీ తన పాత్రను పోషించలేకపోతోందా అన్న చర్చ ఉంది అదే సమయంలో తమ అధినాయకుడు జగన్ ని కూడా కాచుకోలేకపోతే మాత్రం ఓవరాల్ గా అదే పుట్టె ముంచుతుందన్నది కఠినమైన రాజకీయ విశ్లేషణగా ఉంది.