వైసీపీ సత్తాకు అగ్ని పరీక్ష !
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో మరో రెండు నెలలలో మొదలవుతున్నాయి. అవి దశలవారీగా జరుగుతాయని అంటున్నారు.
By: Satya P | 14 July 2026 9:18 AM ISTస్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో మరో రెండు నెలలలో మొదలవుతున్నాయి. అవి దశలవారీగా జరుగుతాయని అంటున్నారు. పంచాయతీల నుంచి కార్పోరేషన్ల వరకూ జరిగే ఈ ఎన్నికల్లో అన్ని చోట్లా తామే గెలిచి సరికొత్త రికార్డుని క్రియేట్ చేయాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. కూటమి నుంచే కొత్త మేయర్లు, జిల్లా పరిషత్తు చైర్మన్లు, మునిసిపల్ చైర్మన్లు, అలాగే ఎంపీ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు ఇలా వేలాది పదవులు కూటమిలోని మూడు పార్టీలకు దక్కబోతున్నాయి.
క్షేత్ర స్థాయిలో బలంగా :
స్థానిక సంస్థల ఎన్నికలో కనుక సీట్లు సొంతం చేసుకుంటే రెండిందాలుగా లాభం అని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఒకటి వైసీపీని మరోసారి ఓడించామని గట్టిగా భజాయించి చెప్పవచ్చు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టవచ్చు అని అంటున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్ లో మూడు పార్టీలలో ఉన్న క్యాడర్ కి మంచి పదవులు దక్కుతాయి. అధికార హోదా వారి పరం అవుతుంది. దాంతో వారంతా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి గట్టి పునాదిగా నిలుస్తారు అని కూడా భావిస్తున్నారు.
అన్నీ చూసుకునే బరిలోకి :
రెండున్నర ఏళ్ళ పాలనలో తాము చేమి మేలు చేశామని చంద్రబాబు పదే పదే చెబుతు వస్తున్నారు. ఆయన జిల్లా పర్యటనలు కూడా మొదలుపెట్టారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ చరిష్మా బీజేపీ తోడ్పాటు అన్నీ కలసి కూటమికి ఒక్క ఓటూ పొల్లుపోకుండా దక్కి తీరుతుందని ధీమా అయితే కూటమిలో ఉంది. టీడీపీ అధినాయకత్వం అయితే మొత్తానికి మొత్తం సీట్లను తామే సొంతం చేసుకోవాలని కూడా గట్టి పట్టుదలతో ఉంది. ఈ విషయంలో వైసీపీని ఎక్కడ ఉంచాలో అక్కడే పెట్టి మరీ జనానికి ఆ పార్టీ రాజకీయ పరిస్థితిని చూపించాలని కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఇక మిత్ర పక్షంలో ఉన్న జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. దాంతో కూటమిలో కో ఆర్డినేషన్ బాగుంటుందని గ్రౌండ్ లెవెల్ లో అంతా కలిసి పనిచేస్తారు అని భావిస్తోంది.
లోకల్ ఫైట్ లో వైసీపీ స్కోర్ :
ఇదిలా ఉంటే అధికారంలో కూటమి ఉంది. అందుకే తాము ఓటమి చెందామని వైసీపీ చెప్పుకోవచ్చు. కానీ ఎంతో కొంత తన ప్రభావాన్ని చూపించకపోతే మాత్రం 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని అంటున్నారు. నిజానికి స్థానిక ఎన్నికల్లో సహజంగానే అధికార కూటమి వైపు జనాలు మొగ్గు చూపిస్తారు. ఎవరు పవర్ లో ఉంటే వారికే పట్టం కడతారు. అదే సమయంలో ఎంతో కొంత డివిజన్ కూడా కనిపిస్తుంది. అది సంకేతంగా ఉంటుంది. మరి అలాంటి పొలిటికల్ డివిజన్ తెచ్చే సత్తా వైసీపీకి ఎంత అన్నది లోకల్ ఫైట్ లో తేలనుంది అని అంటున్నారు.
గ్రౌండ్ లెవెల్ లో గట్టి పోటీ :
వైసీపీ అధినాయకత్వం అయితే ప్రతీ చోటా పోటీ పెట్టాల్సిందే అని తమ నాయకులకు గట్టిగానే సూచిస్తోంది. ఎక్కడ కూడా ఏకగ్రీవాలు ఉండరాదని చెబుతోంది. అంటే భారీ పోటీకి సిద్ధపడమని తలపడమని చెబుతోంది. మరి దానిని ఆ పార్టీ నేతలు ఏ మేరకు పాటించి ఫ్యాన్ రెక్కలు జోరందుకునేలా చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మాట ఎలా ఉన్నా వైసీపీ కనుక గ్రౌండ్ లెవెల్ లో గట్టి పోటీ ఇచ్చినా రేపటికి బాటలు వేసుకున్నట్లే అని అంటున్నారు. మరి మూడు పార్టీల కూటమిని ఎదురొడ్డి ధీటుగా వైసీపీ ఎంతవరకూ నిలబడుతుందో అన్నది చూడాల్సి ఉంది.
