Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ పర్యటనలో అపరిచితుడు.. వైసీపీ ఘాటు రిప్లై

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటనలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడంపై వివాదం పెద్దది అవుతోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2025 2:46 PM IST
పవన్ కల్యాణ్ పర్యటనలో అపరిచితుడు.. వైసీపీ ఘాటు రిప్లై
X

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటనలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడంపై వివాదం పెద్దది అవుతోంది. వైసీపీ కార్యకర్త అనుమానాస్పద కదలికలపై జనసేన పార్టీ కార్యకర్తలతోపాటు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంపై వైసీపీ స్పందన ఆసక్తికరంగా మారింది. పవన్ పర్యటన ప్లాప్ కావడం వల్లే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమానాస్పద కదలికలపై శుక్రవారం జనసేన ఫిర్యాదు చేయగా, అనుమానితుడిగా చెబుతున్న వ్యక్తితో మాట్లాడించి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైసీపీ అప్ లోడ్ చేసింది. ఇక ఆ వీడియోలో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి తాను జనసేన కార్యకర్తగా చెప్పడం గమనార్హం.

పవన్ పర్యటన విఫలమైందనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు వైసీపీ ఎక్స్ లో ట్వీట్ చేసింది. ‘‘ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటన అట్టర్ ప్లాప్ కావడం, సొంత పార్టీ నేతలే తనను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక, టాపిక్ ను డైవర్ట్ చేయడం కోసం తన పర్యటనలో అపరిచిత వ్యక్తి అంటూ మీడియాలో హంగామా చేసి అడ్డంగా దొరికిపోయారు. తీరా చూస్తే ఆ అపరిచిత వ్యక్తి జనసైనికుడే అని తేలిపోయింది. సొంత పార్టీ కార్యకర్తలను చూసి పవన్ కళ్యాణ్ భయపడే పరిస్థికి రావడం బాధాకరం.’’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

పవన్ పర్యటన ముగిసిన రెండు రోజుల తర్వాత ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. టాపిక్ డైవర్షన్ కోసమే జనసేన హంగామా చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. ఇక అనుమానాస్పదంగా తచ్చాడని వ్యక్తి విడుదల చేసిన వీడియోలో తాను ప్రస్తుతం జనసేనలోనే పనిచేస్తున్నట్లు చెప్పడం గమనార్హం. గతంలో తాను వైసీపీలోనే ఉండేవాడినని, కానీ ఇప్పుడు జనసేనలో పనిచేస్తున్నట్లు అనుమానిత కార్యకర్త ఆ వీడియోలో స్పష్టం చేశారు.

అయితే సొంత కార్యకర్త పర్యటనకు వస్తే జనసేన కార్యకర్తలు ఎందుకు అంత టెన్షన్ పడతారనేది? ఆసక్తికరంగా మారింది. అనుమానితుడు పవన్ కు అత్యంత సమీపంలో తిరగడం వల్లే అందరూ ఆందోళనకు గురయ్యారని అంటున్నారు. అలా అని అతడికి రాజకీయ నేపథ్యమే తప్ప, నేరచరిత్ర ఉన్నట్లు ఎక్కడా ఎవరూ చెప్పడం లేదు. దీంతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఎవరైనా తప్పుదారి పట్టించారా? అనే చర్చ కూడా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యనేతల పర్యటనలో కొందరు కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అదేవిధంగా రాజోలులో ఓ వ్యక్తి ఎక్కువ హడావుడి చేసి ఉంటాడని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అనుమానితుడిగా చెబుతున్న వ్యక్తి అదే నియోజకవర్గానికి చెందిన వాడు అయినప్పటికీ స్థానికులు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారనేది కూడా తెలుసుకోవాల్సివుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఒక చిన్న అవగాహన లోపం తీవ్ర కలకలానికి కారణమైందని అంటున్నారు.