Begin typing your search above and press return to search.

వైసీపీ బీజేపీకి భ‌య‌ప‌డుతోందా.. !

ఒక్క ఛాన్స్ అనేది.. వ్యక్తుల‌కే కాదు.. పార్టీల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వేచి చూస్తున్న వైసీపీ వంటి పార్టీలు.. ఏ చిన్న ఛాన్స్ చిక్కినా అల్లుకుపోవాలి.

By:  Garuda Media   |   23 July 2026 5:52 PM IST
వైసీపీ బీజేపీకి భ‌య‌ప‌డుతోందా.. !
X

ఒక్క ఛాన్స్ అనేది.. వ్యక్తుల‌కే కాదు.. పార్టీల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వేచి చూస్తున్న వైసీపీ వంటి పార్టీలు.. ఏ చిన్న ఛాన్స్ చిక్కినా అల్లుకుపోవాలి. దానిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. ప్ర‌జ‌ల త‌ర‌ఫున వాయిస్ వినిపించాలి. అయితే.. కార‌ణాలు ఏమైనా కూడా ఈ విష‌యంలో వైసీపీ వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి. వీటిలో కొన్ని రాష్ట్ర స‌మ‌స్య‌లు ఉండ‌గా.. మ‌రికొన్ని దేశ‌వ్యాప్త స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తం నీట్ ప‌రీక్ష‌పై ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి.

దీనికి దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని ప్ర‌తిప‌క్షాలు కూడా గ‌ళం క‌లిపాయి. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ స‌హా.. ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ ఏక‌మ‌య్యాయి. ఇవ‌న్నీ.. బీజేపీని వ్య‌తిరేకించే పార్టీలే. త‌ద్వారా ఆయా రాష్ట్రా ల్లో విద్యార్థుల త‌ర‌ఫున నిల‌బ‌డి పోరాటాల‌ను ఉద్రుతం చేస్తున్నాయి. ఫ‌లితంగా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఈ పార్టీ లు నిల‌బ‌డ్డాయ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అనేది ముఖ్యం. బీజేపీని వ్య‌తిరేకించ‌డం ఇష్టం లేద‌ని వైసీపీ నాయ‌కుల్లో ఉండి ఉండ‌వ‌చ్చు.

కానీ, ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌ను విస్మ‌రించ‌డం అనేది పార్టీకి తీవ్ర న‌ష్టం క‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ వుతుంది. రాజ‌కీయంగానే ప్ర‌తి అంశాన్నీ చూడ‌లేం. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు అనుగుణంగా కూడా ముందుకు సాగొచ్చు. కానీ, ఈ విష‌యంలో బీజేపీపై ప‌న్నెత్తు మాట కూడా అన‌లేని నిస్స‌హాయ స్థితిలో వైసీపీ ఉండిపోయింద‌న్న టాక్ అయితే.. ప‌బ్లిక్‌లో వినిపిస్తోంది. ఇక‌, స‌ర్‌పైనా ఇదే ధోర‌ణితో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల అనంత‌రం.. ఈవీఎంల‌పై జ‌గ‌న్ అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మించిన‌ప్పుడు.. ఆయ‌న మౌనంగా ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా వైద్య విద్యా సీట్ల‌ను.. మెడిక‌ల్ కాలేజీల‌ను లెక్క‌కు మిక్కిలిగా తీసుకువ‌చ్చామ‌ని చెబుతున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు అదే వైద్య విద్య‌కు సంబంధించి జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌కు దూరంగా ఉండ‌డం.. క‌నీసం ఎంపీల‌ను కూడా ఆయ‌న ప్రోత్స‌హించ‌క‌పోవ‌డం వంటివి.. పార్టీప‌రంగా వ్యూహాత్మ‌క లేమిని స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.