కొమ్మినేని అరెస్ట్ పై పట్టుమని పదిమంది కనిపించలేదా ?
వైసీపీలో ఒక్కో నేత అరెస్టు అవుతున్నారు. అంతే కాదు ఆ పార్టీ యాజమాన్యం ఆధ్వర్యంలో సాగే ఒక టీవీ చానల్ యాంకర్ ని కూడా అరెస్ట్ చేశారు.
By: Tupaki Desk | 10 Jun 2025 3:11 PM ISTవైసీపీలో ఒక్కో నేత అరెస్టు అవుతున్నారు. అంతే కాదు ఆ పార్టీ యాజమాన్యం ఆధ్వర్యంలో సాగే ఒక టీవీ చానల్ యాంకర్ ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఏమి జరుగుతున్నా వైసీపీలో మాత్రం ఎక్కడా చలనం కనిపించడం లేదు అని అంటున్నారు. పార్టీలో ఏమి జరుగుతోంది, అసలు వైసీపీలో చురుకుదనం పుట్టడం లేదా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
వైసీపీ ఇంతితై అన్నట్లుగా ఎదిగిన పార్టీ కేవలం ఇద్దరే ఇద్దరు ప్రజా ప్రతినిధులతో మొదలైన వైసీపీ 2019 ఎన్నికల నాటికి ల్యాండ్ స్లైడ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఏకంగా 151 సీట్లతో అపరిమితమైన అధికారాన్ని సొంతం చేసుకుని పవర్ లోకి వచ్చింది.
ఇక చూస్తే 2024 లో వైసీపీకి 11 సీట్లు వస్తే రావచ్చు కానీ 40 శాతం ఓటు షేర్ తో బలమైన పార్టీగా నిలిచి ఉంది. ఒక వైపు ప్రత్యర్థి పార్టీలు అన్నీ కట్టుగా కూటమిగా ఏర్పడినా వైసీపీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా 40 శాతం ఓటు షేర్ ని సాధించడం అంటే మాటలు కాదు.
ఆ విధంగా వైసీపీ ఓటమిలో కూడా భారీ ఒటను పొందింది. ఇక వైసీపీకి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు రాజకీయంగా యువకుడుగా పరిగణించబడే వైఎస్ జగన్ ఉన్నారు. వైఎస్సార్ ఫ్యామిలీకి ఒక ఇమేజ్ ఉంది. అంతే కాదు కూటమికి యాంటీగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఒడిసిపట్టగలిగే శిబిరంగా అవతల వైపు నిలిచి ఉంది.
ఇక వైసీపీకి చూస్తే పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. అలాగే దిగ్గజ నాయకులతో పాటు యువతరం లీడర్లు కూడా భారీగానే ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఇలా అనేక మంది వైసీపీలో ఉన్నారు.
మరి ఇంత పెద్ద ఎత్తున పార్టీలో ఉన్న వారు కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇదేమిటి అని మాట్లాడడం లేదు అంటే ఏమనుకోవాలని అంటున్నారు. తాజాగా సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సంచలనంగా మారింది. ఆయన మీద అనేక సెక్షన్ల మీద కేసులు పెట్టి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీలో ఉన్న నాయకులు దీని మీద స్పందించేందుకు సైతం మీడియా ముందుకు రావడం లేదు అంటే వైసీపీలో ఏదో జరుగుతోంది అనుకోవాలా అన్న చర్చ అయితే ఉంది. ఇక వైసీపీలో ఉన్న వారు పెదవి విప్పడం లేదు అంటే వారు భయపడుతున్నారా అన్నది కూడా ఒక డౌటానుమానంగా వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.
ఒక రాజకీయ పార్టీ సత్తా ఏమిటి అన్నది విపక్షంలో ఉన్నపుడే తెలుస్తుంది అంటారు. అధికారంలో ఉన్న పార్టీలో అందరూ బంధం కలుపుకుని ముందుకు వస్తారు. ఏ ఇబ్బందులు అక్కడ ఉండవు. దాంతో రాజ విలాసం కోరే చేరే వారు చేరుతూనే ఉంటారు.
ఆ విధంగా చూస్తే పార్టీలో నాయకులకు ఏమి కొదవ అన్న తీరు కనిపిస్తుంది. కానీ విపక్షంలో ఉన్న వేళ కష్టాలను ఎదుర్కోవాల్సిన సందర్భంలోనే నాయకుల నిబద్ధత ఏమిటి అన్నది వెల్లడి అవుతుంది. అలా చూస్తే కనుక వైసీపీలో పిన్ డ్రాప్ సైలెన్స్ రాజ్యం చేస్తోంది. పదవులు అందుకుని ఒక వెలుగు వెలిగిన వారు అంతా ఇపుడు మాకెందుకీ గోల అనుకుంటూ మౌనం వహిస్తున్నారు అన్న మాట వినిపిస్తోంది. పార్టీ ఎంతలా ఆదేశాలు ఇచ్చినా మీడియా ముందుకు కనీసంగా రాని వారి విషయమే ఇపుడు చర్చగా ఉంది.
ఒక విధంగా వైసీపీ అధినాయకత్వానికి కూడా ఇది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. తాము ఎలాంటి వారిని ఎంపిక చేశామన్నది కూడా ఆలోచించుకునేందుకు ఈ పరిణామాలు ఆస్కారం కల్పిస్తున్నాయని అంటున్నారు. ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి అందలాలు అందించిన తరువాత అధికారం అనుభవించి తీరా పవర్ పోగానే స్విచాఫ్ చేసినట్లుగా సైలెంట్ అయిపోతున్న నేతలతో వైసీపీకి ఏటికి ఎదురీతే అంటున్నారు.
అందరినీ నమ్మి వారిలో నాయకులను చూసి కుర్చీలు అప్పగించినందుకు వైసీపీ హైకమాండ్ ఇపుడు ఒక్కసారిగా ఆలోచించించుకోవాల్సిన పని ఉందా అన్నది చర్చగా ఉంది. ఇప్పటికైనా ఎవరికి అందలం ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచించుకోవడానికి ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు.