Begin typing your search above and press return to search.

వైసీపీలో మాజీ రెడ్డి మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కోల్డ్ స్టోరేజ్!

వైసీపీలో ఇపుడు చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి ఉందని అంతా అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 July 2025 8:00 PM IST
వైసీపీలో మాజీ రెడ్డి మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కోల్డ్ స్టోరేజ్!
X

వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది ఇపుడు చర్చ గా ఉంది. ఆ పార్టీని పునాది స్థాయి నుంచి తమ సొంతం చేసుకుని భుజాల మీద మోసి పెంచి పెద్ద చేసిన ఒక బలమైన సామాజిక వర్గం ఇపుడు ఏమి చేస్తోంది అన్నది కూడా చర్చ గా ఉంది. ఆ సామాజిక వర్గం సైలెంట్ అవడం వెనక కారణాలు ఏమిటి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

వైసీపీలో ఇపుడు చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి ఉందని అంతా అంటున్నారు. వైసీపీ అంటేనే రెడ్డి సామాజిక వర్గానికి ఒక పూనకం లాంటిది వస్తుందని అంటున్నారు. తమ పార్టీ తమ జెండా అని మురిసిపోవడం ద్వారా వారు అమితానందం పొందుతారు.

అయితే వైసీపీలో ఇపుడు సీన్ మారుతోందా అన్నదే చర్చగా ఉంది. ఇపుడు వైసీపీలో కొత్తగా వచ్చిన వారు యూత్ కి చెందిన రెడ్లు అయితే మంచి ఊపు మీద కనిపిస్తున్నారు. వారే ఎంతో కొంత పార్టీకి మౌత్ వాయిస్ గా మారుతున్నారు. అదే సమయంలో పార్టీలో పునాదుల నుంచి ఉన్న వారు గట్టి వారు సబ్జెక్ట్ ఉన్న వారు, రాజకీయ అనుభవం దండీగా ఉన్నవారి సంగతి ఏమిటి అన్నది ఒక ప్రశ్నగా ఉంది.

అయితే వారంతా పాత రెడ్లుగా ఒక కేటగిరీగా మారిపోయారా అన్నదే మరో పాయింట్. దాంతో కొత్త నీరు వచ్చాక పాత నీరు పక్కకు తప్పుకున్నట్లుగా వారంతా వెనుకబడిపోతున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే వారు కోల్డ్ స్టోరేజిలో ఉన్నట్లుగానే వైసీపీలో సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన సీనియర్ రెడ్లు పార్టీ లో ఉన్నారా లేరా అన్నతగా తేడా కనిపిస్తోంది అని అంటున్నారు. వీరంతా దైనందిన రాజకీయాలను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. వైసీపీలో ఒక బలమైన గొంతుకగా మాజీ మంత్రి పేర్ని నానిది మాత్రమే వినిపిస్తోంది. అంతే తప్ప మరో వాయిస్ కానీ మరో నాయకుడు కానీ వినిపించడం లేదు, కనిపించడం లేదు అని అంటున్నారు.

ఇక వైసీపీ అధినేత జిల్లా పర్యటనలు బాగానే సక్సెస్ అవుతున్నాయి. జగన్ కి బాగానే జనాలు వస్తున్నారు. అయితే అది జిల్లా అంతటా పార్టీ జనాలను సమీకరించి పోగు చేస్తేనే వచ్చిన జనంగా విశ్లేషణలు ఉన్నాయి. అదే జగన్ ఒక నియోజకవర్గంలోనే పర్యటన చేస్తే అంత జన సమూహం రాకపోవచ్చు అని కూడా అంటున్నారు.

వైసీపీ విషయానికి వస్తే పదిహేనేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీకి పునాదిగా బలమైన రెడ్లు ఉన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోనూ రెడ్లు పవర్ ఫుల్ గా ఉన్నారు. అయినా సరే వారు వైసీపీ విషయంలో పెద్దగా నోరు చేసుకోవడం లేదు, కూటమి ప్రభుత్వం అధికారం ఏడాది దాటినా వారి పెదవులు కదలడం లేదు.

మరి ఏ రాజకీయ మొహమాటాలు అడ్డు వస్తున్నాయో అన్న చర్చ కూడా ఉంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నపుడు సామాజిక న్యాయం సమీకరణలు అని చెప్పి చాలా మంది విషయంలో చేయాల్సింది కూడా ఏమీ చేయలేదు అని అంటున్నారు. ఆ అసంతృప్తి వారిలో ఇపుడు అలాగే ఉంది అని అంటునారు. ఇక వైసీపీ 2.0 అని అంటున్నా ఎవరూ పెద్దగా దానిని పట్టింపుగా తీసుకోవడం లేదని అంటున్నారు.

ఒకసారి అయింది మళ్ళీ వస్తే ఏమవుతుంది, చూద్దాంలే అన్నట్లుగానే సీన్ ఉందిట. అంతే కాదు మరో నాలుగేళ్ళ పాటు కూటమి అధికారంలో ఉంటుంది. దాంతో ఎందుకొచ్చిన రాజకీయ రచ్చ ఎందుకొచ్చిన తంటాలు అని అనుకుంటూ చాలా మంది నిమ్మళంగా ఉంటున్నారుట. మరి కొందరు తెలివైన వారు తెలుగుదేశం నాయకులతో లోపాయికారీగా అవగాహనలు లాలూచీలు పడి తమ పనులు చల్లగా చేసుకుంటున్నారుట. ఎవరి వ్యాపకాలు వ్యాపారాలలో వారు ఉన్నారు తప్పించి వైసీపీ మా పార్టీ అని గుడ్డలు చించుకుని రోడ్ల మీదకు రావడం లేదని అంటున్నారు.

అంతే కాదు గొంతు చించుకోవాల్సిన అవసరం కూడా ప్రస్తుతానికి లేదని అంటున్నారు. వైసీపీకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇలా చాలా మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నా ఎవరూ కూడా పార్టీ పట్ల మునుపటి మాదిరిగా విరగదీసిన తీరులో అభిమానం అయితే చూపించడం లేదని అంటున్నారు.

దీనికి కారణాలు ఏమిటి అంటే అధినాయకత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని అంటున్నారు. పవర్ లో ఉన్నపుడు చేసిన తప్పులు పొరపాట్లు ఇపుడు రివర్స్ లో వచ్చి కొడుతున్నాయా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే వైసీపీ పాత రెడ్లు పాత కాపులు పాత నేతలు ఎపుడు లైమ్ లైట్ లోకి వస్తారు అన్నది ఒక ప్రశ్నగా ఉంటే అసలు వైసీపీలో మెజారిటీ లీడర్లలో చురుకుదనం పుట్టేది ఎపుడు అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది.