Begin typing your search above and press return to search.

కర్త, కర్మ, క్రియ అంతా సజ్జలే..!

విపక్షం వైసీపీలో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర చాలా కీలకంగా మారుతుంది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 12:21 PM IST
కర్త, కర్మ, క్రియ అంతా సజ్జలే..!
X

విపక్షం వైసీపీలో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర చాలా కీలకంగా మారుతుంది. పార్టీ అధికారంలో ఉండగా, ప్రభుత్వ సలహాదారు పదవిలో చక్రం తిప్పిన సజ్జల ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శితోపాటు రాష్ట్ర కోఆర్డినేటర్ పదవిలోనూ కొనసాగుతున్నారు. దీంతో ఆయనపై పార్టీ చాలా బాధ్యతలు మోపింది. ప్రధానంగా విపక్షంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత చేపడుతున్న భారీ కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత సజ్జలకు అప్పగించారు వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి.

కూటమి ప్రభుత్వం వచ్చి ఈ నెల 4వ తేదీకి ఏడాది అవుతుంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కాగా, వైసీపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే తమ ఓటమికి ప్రధానంగా కూటమి పార్టీల నేతలు ఇచ్చిన బూటకపు హామీలే కారణమని వైసీపీ అధినేత జగన్ విమర్శిస్తున్నారు. తనకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ఏడాది అవుతున్నా, హామీలు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంతోపాటు వెన్నుపోటు పొడిచారని ఆక్షేపిస్తూ కూటమి గెలిచిన జూన్ 4న వెన్నుపోటు దినంగా భావిస్తూ ఆందోళన చేస్తామని వైసీపీ గతంలో ప్రకటించింది.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యతను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జలకు అప్పగించారు అధినేత జగన్. గ్రామ, మండల స్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆందోళన కార్యక్రమాలను సక్సెస్ చేయాలని కోరుతూ సజ్జల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడి వెన్నుపోటు దినం నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

ఇప్పటికే ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారని చెప్పిన సజ్జల పార్టీ కేడర్ అంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా ప్రభుత్వం ఈ ఆందోళన కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనలను నిర్వహించాలని సూచించారు.