వైసీపీ వారి చుట్టూ తిరుగుతోందా ?
ఏపీలో వైసీపీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకోవాలీ అంటే అనేక అంశాలు అందులో చూడాల్సిందే. వైసీపీ అన్న పార్టీ ఆవిర్భావం వెనక ఉన్నది వైఎస్సార్.
By: Satya P | 25 Feb 2026 5:25 AM ISTఏపీలో వైసీపీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకోవాలీ అంటే అనేక అంశాలు అందులో చూడాల్సిందే. వైసీపీ అన్న పార్టీ ఆవిర్భావం వెనక ఉన్నది వైఎస్సార్. వైఎస్సార్ అకాల మరణంతోనే వైసీపీ ఏర్పాటు అయింది. ఇక వైఎస్సార్ మరణించిన తరువాత గుండె ఆగి చనిపోయిన వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్రను నిర్వహించేందుకు అప్పటి కాంగ్రెస్ ఎంపీ అయిన వైఎస్ జగన్ కి కాంగ్రెస్ అధినాయకత్వం అనుమతి ఇవ్వలేదు అన్న దాని మీద మొదలైన అసంతృప్తి మెల్లగా అసమ్మతి గా మారి అది కాస్తా విభేదాలుగా పెరిగి చివరికి జగన్ కాంగ్రెస్ నుంచి 2010 నవంబర్ 29న బయటకు వచ్చేందుకు కారణం అయింది. ఇది వైసీపీ ఏర్పాటు వెనక ఉన్న విషయం.
వైఎస్సార్ ని గుర్తు చేస్తూ :
ఇక వైసీపీ 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ పేరు చెప్పుకునే జనంలోకి వెళ్ళింది. దాని కంటే ముందు కడప లోక్ సభకు పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా జగన్ వైఎస్ విజయమ్మలను వైఎస్సార్ మృతి సానుభూతి వల్లనే భారీ మెజారిటీలతో జనాలు నెగ్గించారు అన్నది ఉంది. 2014 నాటికి వస్తే అపుడు కూడా వైఎస్సార్ చరిష్మాతోనే వైసీపీ ఎన్నికలకు వెళ్ళింది. ఏకంగా 67 సీట్లను ఏపీలో సాధించి అతి పెద్ద బలమైన విపక్షంగా మారింది.
కట్ చేస్తే అక్కడ :
ఇక 2019 ఎన్నికల నాటికి వైసీపీ అధినేత జగన్ తనకంటూ రాజకీయంగా బలమైన ఇమేజ్ ని సాధించారు. దానికి తోడు పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. దాంతో వైసీపీకి 2019 ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలు సైతం దోహదపడి తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించింది. 2024 నాటికి అయితే వైసీపీ పూర్తిగా తమ అయిదేళ్ళ పాలన సంక్షేమ పధకాలు వీటినే నమ్ముకుంది. అదే సమయంలో తమ పాలనలో కొన్ని వర్గాలు తీవ్ర అసంతృపితో ఉన్నాయని సంగతిని మరచింది. అలా బలమైన సామాజిక వర్గం కాపులు వైసీపీకి దూరం అయ్యారు. అలాగే బీసీలు ఓసీలు కూడా దూరం కావడంతో వైసీపీకి భారీ ఓటమి సంభవించింది.
తత్వం బోధ పడ్డాక :
ఇక 2024 లో కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో తత్వం వైసీపీకి బోధపడింది అని అంటున్నారు. దాంతో పోయిన చోటనే వెతుక్కోవాలని వైసీపీ భావిస్తోంది. ఆ విధంగా వైసీపీ కాపులను తిరిగి తమ వైపునకు తిప్పుకునేందుకు యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తోంది. ఇక వైసీపీలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి జగన్ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఆయనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించారు. అలాగే పేర్ని నాని క్రిష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి కాపు కాస్తూ ఉన్నారు. ఇక వైసీపీకి రాజమండ్రి జిల్లాలో జక్కంపూడి రాజా అలాగే విశాఖ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్, విజయనగరంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు కాపు కీలక నేతలుగా ఉంటూ వస్తున్నారు.
పోటీ పెరిగిందా :
ఈ నేపథ్యంలో వైసీపీకి కాపుల మద్దతు కావాల్సిన అవసరం ఉంది. కాపు నేతలు ఎంత మంది ఉన్నా కాపులను ఆకట్టుకునే వారు కావాల్సి ఉంది. అందుకే ముద్రగడను వైసీపీ ప్రోత్సహిస్తూ వచ్చింది. ఒక దశలో పేర్ని నాని కూడా దూకుడు చూపించారు. ఇక గుడివాడ విషయం కూడా అలాగే ఉంది. కానీ అరెస్ట్ తరువాత వైసీపీలో అంబటి రాంబాబు ఇమేజ్ కూడా బాగా పెరిగింది అని అంటున్నారు. ఆయనను కాపులకు టైగర్ అని ఏకంగా అధినేత జగన్ అనడంతో వైసీపీలో ఆయన పెద్ద కాపుగా ఉండబోతున్నారు అన్నది మరో చర్చగా ముందుకు వస్తోంది. అంబటికి మంచి వాగ్దాటి ఉంది, దూకుడుగా సాగే నైజం ఉంది. దాంతో పాటు ఇపుడు ఆయన కుమార్తె మౌనిక కూడా తన సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీలో రానున్న రోజులలో అంబటికి మరింత ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. వైసీపీ కూడా కాపులకే పెద్ద పీట వేయాలని నిర్ణయించుకోవడంతో కాపు నేతలు అంతా రేసులో దూసుకుని వస్తున్న వేళ అంబటి ఒక మెట్టు పైన ఉన్నారు అన్నది పార్టీలో వినిపిస్తున్న మాట అని అంటున్నారు.
