Begin typing your search above and press return to search.

వైసీపీ వెన్నుపోటుకు మైలేజ్ ఎంత ?

వెన్నుపోటు దినం అని వైసీపీ చాలా ఘనంగా నిర్వహించడానికి చూస్తోంది. ఈ విధంగా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకతను పెంచడానికి చూస్తోంది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 8:24 PM IST
వైసీపీ వెన్నుపోటుకు మైలేజ్ ఎంత ?
X

వెన్నుపోటు దినం అని వైసీపీ చాలా ఘనంగా నిర్వహించడానికి చూస్తోంది. ఈ విధంగా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకతను పెంచడానికి చూస్తోంది. అయితే కేవలం ఏడాది మాత్రమే అయిందని ఇంకా సర్కార్ కుదురుకోలేదని ఇంతలోనే అంత పెద్ద మాట వెన్నుపోటు అంటూ జనంలోకి వెళ్ళడం మంచిదేనా అన్న చర్చ వస్తోంది.

నాలుగేళ్ళ కాలం ప్రభుత్వానికి మిగిలి ఉందని ఈ లోగా అన్నీ సర్దుకుంటే కనుక పధకాలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక వెన్నుపోటు దినం అని అంటున్నా జనంలో రియాక్షన్ ఏ మేరకు వస్తుందో అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇంకా కూటమి సర్కార్ మీద పెద్దగా వ్యతిరేకత అయితే రాలేదు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక కుటుంబ పెద్దగా చెప్పాల్సినవి అన్నీ ప్రజలకే నేరుగా చెబుతున్నారు. తాను ఏమి చేయగలనో వివరిస్తున్నారు. ఆయన ఏ ఒక్క హామీని చేయను అని చెప్పడం లేదు, మరి ఇంతలోనే ఎందుకు వైసీపీకి తొందర అన్న చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే వెన్నుపోటు దినం అని వైసీపీ టైటిల్ పెట్టి జనంలోకి వెళ్తోంది ఆ మాట సరే కానీ ముందు పార్టీని చక్కదిద్దుకోకుండా జనంలకి వెళ్తే లాభం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే వైసీపీకే వెన్నుపోట్లు పొడిచి పార్టీని వీడిన వారు చాలా మంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

పార్టీకి పునాదుల నుంచి ఉన్న వారు కూడా హ్యాండ్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి వారి సంగతి చూసుకోవాలి కదా అని అంటున్నారు. చాలా మంది నేతలు ఇంకా వైసీపీలో సైలెంట్ మోడ్ లో ఉన్నారని అంటున్నారు. ముందు వారిని కదిలించే ప్రయత్నం చేయాలని పార్టీని ఒక గాడిన పెట్టేందుకు ఈ సమయం కేటాయిస్తే బాగుంటుంది అని అంటున్నారు.

అలా కాకుండా కూటమి మీద యుద్ధం ప్రకటించడానికి ఇది సరైన సమయం కాదేమో అని అంటున్నారు. ప్రజలు కూడా గతానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. పధకాలు కొన్ని అందడం లేదని బాధ ఉన్నా కూడా ప్రభుత్వానికి నిధుల కొరత ఉందని ఆదాయం ఇంకా పూర్తిగా సమకూరలేదని జనాలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఆ విధంగా సర్కార్ కి సహకరించే ధోరణిలో జనాలు ఉన్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే మధ్య తరగతి ఉన్నత వర్గాలు అంతా కూడా ఉచిత పధకాల మీద వైముఖ్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. అభివృద్ధి చేస్తేనే ఏపీ సాఫీగా ముందుకు సాగుతుందని ఆ ప్రగతి వల్లనే పది కాలాల పాటు రాష్ట్రం బాగుంటుంది అని అంటున్నారు.

అలా చేయకుండా పప్పు బెల్లాలు మాదిరిగా పధకాలకు ఖర్చు చేస్తూ పోతే ఏపీ అప్పుల పాలు కావడం తప్ప మిగిలేది ఒరిగేది ఏముంది అన్న చర్చ కూడా ఉంది. ఇక పేద వర్గాలలో పధకాల మీద ఆశ ఉంది. కానీ వారు కూడా కూటమి ప్రభుతమే ఏదో నాటికి ఇస్తుందని భరోసాతో ఉన్నారు.

ఈ నేపధ్యంలో వెన్నుపోటు అని వైసీపీ జనంలోకి రావడం వల్ల వచ్చే పొలిటికల్ మైలేజ్ ఎంత వరకూ అన్న చర్చ సాగుతోంది. దానికి బదులుగా వైసీపీలో వెన్నుపోట్లు పొడుస్తున్న నాయకుల విషయంలో తగిన ఆలొచనలు చేసి చర్యలు తీసుకుంటే పార్టీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు.