కీలక నిర్ణయం దిశగా వైసీపీ.. విస్తృత స్థాయి సమావేశంలో చర్చ!
కూటమి ప్రభుత్వంపై పట్టు బిగించేలా వైసీపీ కీలక రాజకీయ నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు.
By: Tupaki Desk | 25 Jun 2025 1:25 PM ISTకూటమి ప్రభుత్వంపై పట్టు బిగించేలా వైసీపీ కీలక రాజకీయ నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధినేత జగన్ తో పాటు సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్ సీపీ నేతలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై చర్చిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైసీపీ భావిస్తోంది. ఆ దిశగా కార్యక్రమాల నిర్వహణపై అధినేత జగన్ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఏడాది పాలన ముగియడంతో తాము చేసిన మంచిని చాటుకోవాలని ప్రభుత్వం ఒకవైపు భావిస్తోంది. మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో వచ్చేనెలలో ఎమ్మెల్యేల పర్యటనకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పోటీగా వైసీపీ కూడా ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. దీంతో ఏపీ రాజకీయాలు వేడెక్కనున్నాయి. ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ఇంకా అమలు చేయలేదు. జూన్ లో ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా, ఇంతవరకు ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేలా ఒత్తిడి పెంచడంతోపాటు ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులను ఎదుర్కొని పార్టీని నడపడంపై చర్చ జరుగుతోంది.
