వైసీపీలో మారాల్సింది ఎవరు.. మార్చేది ఎవరు ?
ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల జగన్ ని పులివెందుల ఎమ్మెల్యే అని ప్రత్యర్థి పార్టీలు పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 2 April 2025 4:00 PM ISTఅవును వైసీపీ ఇపుడు విపక్షంలో ఉంది. ఎన్నడూ లేని సంక్షోభంలో ఉంది. కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి ఈ దఫా దక్కాయి అంటే దారుణమైన ఫలితమే కదా అని అంటున్నారు. అంతే కాదు అసెంబ్లీకి వైసీపీ కనీసం వెళ్ళలేని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.
ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల జగన్ ని పులివెందుల ఎమ్మెల్యే అని ప్రత్యర్థి పార్టీలు పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమి చెంది పది నెలలు పై దాటుతోంది. మరి పార్టీ పరమైన రిపేర్లు ఉన్నాయా దిద్దుబాట్లు చేసుకుంటున్నారా అన్న చర్చ అయితే ఉంది. జగన్ విషయానికి వస్తే ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు అని అంటున్నారు.
పార్టీకి అందుబాటులో ఉండాల్సిన వేళ ఆయన ఈ విధంగా చేయడం పట్ల కూడా చర్చ సాగుతోంది. జగన్ మారాలి అని అంటున్న వారూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు జగన్ లో కొంత మార్పు అయితే కనిపిస్తోంది అని అంటున్నారు. లోక్ బాడీ ఎన్నికలో అధికార కూటమిని ఎదిరించి ప్రాణాలు ఒడ్డి మరీ పార్టీని గెలిపించిన వారితో జగన్ భేటీ కావడమే ఈ మార్పు అని అంటున్నారు
నిజానికి చూస్తే ఇటువంటి సమావేశాలు వైసీపీలో జరిగిన సందర్భాలు అయితే లేవు ఇవన్నీ టీడీపీ లాంటి పార్టీలలో జరుగుతాయి. వైసీపీలో క్యాడర్ లీడర్ ల మధ్య అనుసంధాన ప్రక్రియ కొంచెం కష్టంగానే ఉంటుంది అయితే ఇపుడిపుడే వైసీపీ అధినాయకత్వం వాస్తవాలను తెలుసుకుంటోంది అని అంటున్నారు. అందుకే పార్టీ కోసం కొమ్ము కాసిన వారిని జగన్ తన వద్దకు పిలిపించుకుని అభినందించడం జరుగుతోంది అని అంటున్నారు.
అంతే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో హత్యకు గురి అయిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా తాను వస్తాను అని జగన్ చెప్పడం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపడం వంటివి నిజంగా ఆహ్వానించతగిన పరిణామాలే అని అంటున్నారు. వైసీపీలో జగనే కీలకం. ఆయనతోనే పార్టీ ఉంది.
ఆయన చుట్టూనే పార్టీ అల్లుకుంది. అధికారంలో ఉన్నపుడు కూడా వైసీపీ పెద్దలు అదే చెప్పేవారు. తాము ఎవరిని నిలబెడితే వారే గెలుస్తారు అని కూడా గట్టిగా మాట్లాడేవారు. అంతకు ముందు 2014 నుంచి 2019 మధ్యలో కూడా జగన్ ఒక్కరే జనంలోకి వెళ్ళారు. ఆయనే పోరాటాలు చేశారు. ఆయనే పాదయాత్ర చేశారు. అన్ని నిరసన కార్యక్రమాలలో ఆయనే పాలు పంచుకున్నారు.
అలా నిత్యం జనంలో జగన్ ఉండడం వల్లనే పార్టీ కూడా బలంగా మారింది. క్యాడర్ కి లీడర్ కి ఉత్తేజం కలిగింది. కానీ ఇపుడు చూస్తే అధినేత కాకుండా పార్టీ నేతలను జనంలోకి వెళ్ళమంటే ఎలా అన్న చర్చ వస్తోంది. ఒకవేళ వెళ్ళినా వారి వల్ల వచ్చేది పెద్దగా ఏమి ఉంటుంది అని కూడా అంటున్నారు. జగన్ కి ప్రజాదరణ ఉంది. ఆయన మాస్ లీడర్. ఆయనే కూటమి ప్రభుత్వానికి ఎదురొడ్డి జనంలో నిలిస్తేనే ఆయన వెంట క్యాడర్ కూడా పరుగులు తీస్తుంది అని అంటున్నారు.
వైసీపీ అధినాయకత్వంలో ఈ మార్పు రావాలని అంటున్నారు అయితే జగన్ కూడా జనంలోకి వెళ్ళాలనే అనుకుంటున్నారు అంటున్నారు. ఒక ఏడాది పాటు అయినా ఈ ప్రభుత్వానికి గడువు ఇచ్చి ఆ మీదట జనంలోకి వెళ్తే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆ ఆలోచన బాగానే ఉన్నా ఈలోగా అయినా క్యాడర్ వద్దకు వెళ్తూ పార్టీ కోసం ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శిస్తూ ఉంటే కనుక కొంత ఊపు వస్తుందని అంటున్నారు. మరి వైసీపీ హైకమాండ్ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
