Begin typing your search above and press return to search.

వైసీపీ టాక్‌: ప్లీన‌రీ సంద‌డేది ..!

టీడీపీలో మ‌హానాడుకు ఎంత ప్రాధాన్యం ఉందో.. అదేవిధంగా వైసీపీ నిర్వ‌హించే ప్లీన‌రీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంది.

By:  Garuda Media   |   25 May 2026 7:00 AM IST
వైసీపీ టాక్‌: ప్లీన‌రీ సంద‌డేది ..!
X

టీడీపీలో మ‌హానాడుకు ఎంత ప్రాధాన్యం ఉందో.. అదేవిధంగా వైసీపీ నిర్వ‌హించే ప్లీన‌రీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఏటా జూన్‌-జూలై మ‌ధ్య‌లో వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న ప్పుడు.. లేన‌ప్పుడు కూడా.. ప్లీన‌రీని నిర్వ‌హించారు. అప్ప‌ట్లో ప్ర‌త్యేకంగా రెండు మాసాల ముందు నుంచే ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేసేవారు. నాయ‌కుల‌కు ప్ర‌త్యేక ఆహ్వానాలు కూడా అందేవి. అదేవిధంగా ప్రాంగ‌ణాల ఏర్పాటు.. స‌మీక‌ర‌ణ‌ల‌పై దృష్టి పెట్టేవారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే టీడీపీ మ‌హానాడు మాదిరిగానేవైసీపీ కూడా ప్లీన‌రీకోసం అంతే హ‌డావుడి చేసేది. అయితే.. గ‌త ఏడాది మాత్రం ప్లీన‌రీని విర‌మించారు. వాస్త‌వానికి 2024లో కూడా ప్లీన‌రీ నిర్వ‌హించ‌లేదు. అప్ప‌ట్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు భిన్నంగా రావ‌డంతోపాటు.. వైసీపీకి కేవ‌లం 11 స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం ద‌క్క‌డంతో పార్టీనాయ‌కులు, కార్య‌క‌ర్త‌లుకూడా.. విషాదంలో మునిగిపోయారు. దీంతో 2024లో ప్లీన‌రీని వాయిదా వేశారు.

ఇక‌, గ‌త ఏడాది అయినా.. నిర్వ‌హించారా? అంటే.. లేదు. వ‌చ్చేఏడాది(2026)లో ఘ‌నంగా నిర్వ‌హిద్దామని అప్ప‌ట్లో పార్టీ అధినేత‌గా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని మీడియాకు కూడా చెప్పారు. అంటే.. ఈ ఏడాది జూన్‌-జూలై మ‌ధ్య ప్లీన‌రీ ఏర్పాటు చేయాల్సి ఉంది. అంటే.. మ‌రో 10 రోజుల వ్య‌వ‌ధిమాత్ర‌మే క‌నిపిస్తోంది. మ‌రి దీనికి సంబంధించి ఏమైనా.. హంగు ఆర్భాటాలు క‌నిపిస్తున్నాయా? చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయా? అంటే.. అంద‌రూ మౌనంగానే ఉన్నారు.

తాడేప‌ల్లిలో నిత్యం సంచ‌రించే నాయ‌కులు కూడా.. త‌మ‌కు ఇంకా స‌మాచారం లేద‌ని అంటున్నారు. కాగా.. వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జూలై 8కి ముందు రెండు రోజులు నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కానీ.. నెల రోజుల ముందుగానే గ‌తంలో ఉండే హ‌డావుడికానీ.. ఏర్పాట్ల‌కు సంబంధించిన స‌మీక్ష‌లు కానీ.. లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, గ‌త ఓట‌మి త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ పుంజుకుందా? అంటే ప్ర‌శ్న‌లే మిగులుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు నెల‌కొన్నాయి. మ‌రోవైపు.. వ‌చ్చేఏడాది నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌నున్నారు.