Begin typing your search above and press return to search.

జగన్ నోట ప్లీనరీ మాట !

టీడీపీ తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి వేళను పురస్కరించుకుని మూడు రోజుల పాటు మే నెలలో మహానాడు నిర్వహిస్తూ వస్తోంది.

By:  Tupaki Desk   |   8 May 2025 6:00 AM IST
YS Jagan Gears Up for 2026 With Mega Plenary
X

వైసీపీ ఏర్పాటు చేశాక రెండు ప్లీనరీలను గట్టిగా చేశారు అన్నది అందరికీ గుర్తు ఉంది. టీడీపీకి మహానాడు మాదిరిగా వైసీపీకి ప్లీనరీ అన్నది అతి పెద్ద పార్టీ వేదికగా నిర్వహించే కార్యక్రమం. టీడీపీ తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి వేళను పురస్కరించుకుని మూడు రోజుల పాటు మే నెలలో మహానాడు నిర్వహిస్తూ వస్తోంది.

ఇక వైసీపీ కూడా వైఎస్సార్ జయంతిని దృష్టిలో ఉంచుకుని జూలై 7, 8 తేదీలలో రెండు రోజుల పాటు ప్లీనరీని నిర్వహిస్తోంది. అయితే వైసీపీ విపక్షంలో ఉన్నపుడు 2017లో ప్లీనరీని బ్రహ్మాండంగా నిర్వహించింది. అందులోనే రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ని పార్టీ క్యాడర్ కి పరిచయం చేశారు. అంతే కాదు జగన్ పాదయాత్ర గురించి అందులోనే డిసైడ్ చేశారు ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర స్టార్ట్ అయి 2019 జనవరి 9 వరకూ కొనసాగింది. ఆ మీదట వైసీపీని ఆ పాదయాత్ర అధికారంలోకి తెచ్చింది.

అలా 2017లో జరిగిన వైసీపీ ప్లీనరీకి ఒక చరిత్ర అయితే ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక 2022లో మరోసారి వైసీపీ ప్లీనరీని అధికారికంగా నిర్వహించారు. ఈ ప్లీనరీలోనే జగన్ ని పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారని ప్రచారం సాగింది. దానిని కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోలేదని అన్నారు. మొత్తానికి అదేమీ లేదని వైసీపీ తేల్చేసింది.

మరి వైసీపీ పార్టీ రాజ్యంగం ఏమిటి అన్నది తెలియదు కానీ ఆ పార్టీ ప్లీనరీని ఒకసారి అయిదేళ్ళ గ్యాప్ లో నిర్వహించింది. ఈసారి నాలుగేళ్ళ గ్యాప్ లో 2026లో నిర్వహిస్తారని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. సంస్థాగతంగా చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఆ విధంగా చూస్తే వచ్చే ఏడాది వైసీపీ ప్లీనరీని నిర్వహిస్తారు అని అంటున్నారు.

ఇదే విషయాన్ని జగన్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్లీనరీ గురించి తెలియచేసారు. ప్లీనరీని గొప్పగా నిర్వహిద్దామని జగన్ చెప్పారు అంతే కాదు గ్రామ వార్డు బూత్ లెవెల్ దాకా పార్టీ కమిటీలు పూర్తి అయ్యేనాటికి వైసీపీ సభ్యత్వం 18 లక్షల మంది దాకా ఉంటారని జగన్ చెప్పుకొచ్చారు.

ఇక వైసీపీ ప్లీనరీ అనంతరం పూర్తి స్థాయిలో వైసీపీని జనంలో ఉంచాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు రీజనల్ కో ఆర్డినేటర్లు కలసి ప్రతీ జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలని జగన్ సూచించారు. నియోజకవర్గాలలో ఇంచార్జిలు నిరంతరం ప్రజలలో ఉండేలా బాధ్యత తీసుకోవాల్సింది పార్లమెంటరీ పరిశీలకులే అని జగన్ స్పష్టం చేస్తున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవాల్సింది పార్టీ నేతలే అని ఆయన చెప్పుకొచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అలాగే సంక్షేమ పధకాలు అమలు కావడం లేదని అన్ని రంగాలలో కూడా ఇబ్బందులు ఉన్నాయని వాటిని ప్రజలలో ఉంచాలని జగన్ కోరారు.

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీని బూత్ లెవెల్ దాకా పటిష్టం చేయడానికి జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. అలా బూత్ స్థాయి దాకా కమిటీలు వేసిన అనంతరం 2026 జూలై 7, 8 తేదీలలో వైసీపీ ప్లీనరీని నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ ప్లీనరీలోనే జగన్ మరోసారి పాదయాత్ర చేయాలన్న దాని మీద నిర్ణయం తీసుకుని వైసీపీని జోరు చేస్తారని అంటునారు. అంటే సార్వత్రిక ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుంచే వైసీపీ అధినేత జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ ప్లీనరీ అంటే క్యాడర్ లో జోష్ వస్తోంది.