వన్ ఇయర్ ఓవర్: వైసీపీ ఎమ్మెల్యేల జోరెలా ఉంది..?
వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఒకవైపు ప్రభుత్వ పక్షాన ఎమ్మెల్యేలు, నాయకుల తీరుపై సర్వేలు.. రిపోర్టులు తెప్పించుకుంటున్న ముఖ్యమంత్రి.. దానికి అనుగుణంగా నాయకులను మలుస్తున్నారు.
By: Tupaki Desk | 12 Jun 2025 8:30 PMవైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఒకవైపు ప్రభుత్వ పక్షాన ఎమ్మెల్యేలు, నాయకుల తీరుపై సర్వేలు.. రిపోర్టులు తెప్పించుకుంటున్న ముఖ్యమంత్రి.. దానికి అనుగుణంగా నాయకులను మలుస్తున్నారు. హెచ్చరిస్తున్నారు. ప్రజల మధ్య ఉండాలని షరతులు కూడా విధిస్తున్నారు. మరి ఈ రకంగా చూసుకుంటే.. వైసీపీ ఏం చేసింది? ఆ పార్టీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అంచనా వేసిందా? నాయకుల పనితీరుపై నిర్దేశాలు చేసిందా? అనేది ఆసక్తికర విషయం.
ఎందుకంటే.. గతం ఎలా ఉందో.. దానికి ప్రజల ఆమోదం ఎలా ఉందో తెలుసుకుంటే.. దానిని బట్టి భవిష్య త్తును నిర్ణయించుకునే విధానం గోచరిస్తుంది. దాని ప్రకారం ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఆ తరహా ప్రణాళికలు వేసుకుంటాయి. మరి ఈ రూపంలో చూసుకుంటే.. వైసీపీ తనకున్న 11 మంది ఎమ్మెల్యేల పరిస్థితిని అంచనా వేసుకుందా? అంటే.. లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలపనితీరుపై ఒక అంచనాకు రాలేక పోయారు.
పైగా.. అసలు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేయలేకపోయారు. కనీసం.. ప్రజల్లో ఉండాలని.. నియోజకవర్గాల్లో పర్యటించాలని కూడా పార్టీ కార్యాలయం ఎలాంటి కార్యాచరణా ఇవ్వలేదు. అయితే.. అప్పుడే ఎందుకన్న సందేహం వస్తుంది. కానీ, 23 మందితో గెలిచిన టీడీపీ 2019లో ఆరు మాసాల్లోనే ఎమ్మెల్యేల రిపోర్టులు తెప్పించుకుంది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండేలా వారిని మలుచుకుంది. ప్రజల్లో ఉంటేనే మళ్లీ టికెట్లు అంటూ.. ఓడిన వారికి కూడా దిశానిర్దేశం చేసింది.
ఫలితంగానయానో.. భయానో.. నాయకులు ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలపై గళం విప్పారు. వైసీపీ ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు అంత లేకపోయినా.. కనీసం పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేలా కూడా.. పార్టీ కార్యాలయం నుంచి దిశానిర్దేశం లేక పోవడం గమనార్హం. గతంలో గెలిచిన, ఓడిన నాయకు లు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. దీనికి వారి తప్పులతోపాటు.. పార్టీ నుంచి కూడా పెద్ద తప్పులు జరుగుతున్నాయి.
అంతా జగనే చూసుకుంటున్నారని.. పార్టీ ఆఫీసులో తమకు స్వేచ్ఛలేదని భావిస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వీరిలోనూ.. ఒకరిద్దరు అసలు నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి మారి.. ప్రజల చేత, ప్రజల కొరకు.. అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తేనే.. మళ్లీ ఆదరణదక్కుతుందన్నది వాస్తవం.