వైసీపీలో 'నవంబరు 12' సందడేది ..!
వైసీపీలో నవంబరు 12కు ప్రత్యేకత ఉంది. ఇటీవల ఆ పార్టీ అధినేత జగన్.. నవంబరు 12 గురించి నొక్కి చెప్పారు.
By: Garuda Media | 11 Nov 2025 3:39 PM ISTవైసీపీలో నవంబరు 12కు ప్రత్యేకత ఉంది. ఇటీవల ఆ పార్టీ అధినేత జగన్.. నవంబరు 12 గురించి నొక్కి చెప్పారు. నాయకులు, కార్యకర్తలు అందరూ నవంబరు 12ను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలని కూడా సూచించారు. అందరికీ పేరు పేరునా కూడా గుర్తు చేశారు. కానీ, ఆ తరహా ఊపు.. ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీలో ఎక్కడా వేడి కూడా రావడం లేదు. పైగా... ఒకరిద్దరు నాయకుల వ్యవహారంపై చర్చ సాగుతోంది.
అసలు జగన్ ఏం చెప్పారు..?
వాస్తవానికి జగన్.. గత నెల రోజులుగా కొన్ని సమస్యలపై ఉద్యమించాలని.. ప్రయత్నిస్తున్నారు. తాను రాకపోయినా.. పార్టీ నాయకులను, మాజీ మంత్రులను బరిలో నిలుపుతున్నారు. వారితో కార్యక్రమాలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. వీటిలో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంటు, అదేవిధంగా రైతుల పంటలకు సంబంధించిన మద్దతు ధరలు, ఎరువుల సమస్యలు ఉన్నాయి. వీటిపై ఉద్యమించాలని నిర్ణయించారు.
కానీ, ఈ కార్యక్రమాలకు ముహూర్తాలు పెట్టిన ప్రతిసారీ.. ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. దీంతో వాటిని వాయిదా వేస్తున్నారు. ఇటీవల కూడా మొంథా తుఫానుకు ముందు రోజు ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాటినని వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా నవంబరు 12ను ముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన హోరు కనిపించాలని స్ఫష్టం చేశారు.
కానీ, చిత్రం ఏంటంటే.. ఈ తరహా ఊపు ఎక్కడా వైసీపీలో కనిపించడం లేదు. కొందరు కూటమి సర్కారు కు కితాబులిస్తుండడాన్ని.. నాయకులు ప్రస్తావిస్తున్నారు. మరికొందరు తమకు పార్టీ పదవులు దక్కలేదన్న ఆవేదనతో ఉన్నారు. ఇంకొందరు.. ఇప్పుడే సమయం రాలేదన్న భావనతోనూ ఉన్నారు. దీంతో వైసీపీ అధినేత నవంబరు 12 పిలుపును దాదాపు ఎవరూ పట్టించుకోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా.. ఇప్పటి వరకు చేపట్టిన నిరసనల్లో కేవలం ఒక్కటి మాత్రమే హిట్టయిందన్న వాదన పార్టీలో ఉంది.
