Begin typing your search above and press return to search.

వైసీపీ వారసుల ఆశలకు బ్రేకేసిన పిల్లి లొల్లి

బీసీ నేత రాజ్య సభ సభ్యుడు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్

By:  Tupaki Desk   |   19 July 2023 12:58 PM GMT
వైసీపీ వారసుల ఆశలకు బ్రేకేసిన పిల్లి లొల్లి
X

తూర్పుగోదావరి జిల్లాలో కీలక బీసీ నేత రాజ్య సభ సభ్యుడు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తన రెండవ కుమారుడుని రాజకీయ వారసుడిగా ముందుకు తీసుకుని వద్దామని భావిస్తున్నారు. దాంతో రామచంద్రపురం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ సీటునే కదపాలని భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఆదివారం ఆత్మీయ సభ పేరుతో ఆయన పెట్టిన మీటింగ్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.

అదే టైం లో ఈ కాక కాస్తా వైసీపీ హై కమాండ్ కి సైతం తాకింది. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ని పిలిపించి మరీ మాట్లాడారని, అన్ని విషయాలు తెలుసుకున్నారని అంటున్నారు. తన కుమారుడికి టికెట్ అని సడెన్ గా ముందుకు తెచ్చిన బోస్ మీద సీఎం ఒకింత అసహనం వ్యక్తం చేశారు అని ప్రచారం సాగుతోంది. ఆ విషయం గతంలోనే చెప్పాల్సింది అని సీఎం అన్నారని అంటున్నారు.

వారసులకు టికెట్లు అన్నది ఇపుడు ఆలోచించడంలేదు అని సీఎం అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ దఫా సీనియర్లు, సిట్టింగులకే టికెట్లు అని వైసీపీ హై కమాండ్ చెప్పకనే చెప్పింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే వేణుకే టికెట్ ఖరారు అయింది అని అంటున్నారు. నిజానికి ఎంపీ పిల్లి, మంత్రి వేణుల మధ్య పంచాయతీని హై కమాండ్ లెవెల్ లో ఎపుడో పరిష్కారం చేసి ఉంచారు.

ఆరేళ్ళ పాటు కాలపరిమితి కలిగిన రాజ్యసభ సీటుని పిల్లికి ఇచ్చి పెద్దల సభలో గౌరవం కల్పించారు. అలా ఆయనకు న్యాయం చేస్తూ రాజకీయంగా కొత్త తరం అని రామచంద్రాపురంలో మంత్రి పదవి ఇచ్చి వేణును ముందుకు తెచ్చారు. అయితే తనకు ఎంపీ సీటుతో పాటు తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ అంటూ అన్నీ తమకే అనే విధంగా పిల్లి కోరుకోవడం పట్ల వైసీపీ హై కమాండ్ అసంతృప్తిగా ఉంది అని అంటున్నారు.

ఒక్క మాటలో చెప్పాలీ అంటే పిల్లి ఆశలు అన్నవి తీరవనే అంటున్నారు. అదే సమయంలో వారసులను ముందు పెట్టి రాజకీయం చేయాలని ఏ నేతలు చూసినా కుదరదు అన్నదే హై కమాండ్ ఇచ్చే సందేశం అంటున్నారు. ఉత్తరాంధ్రాలో మొదలుకుని అనంతపురం దాకా చాలా చోట్ల వారసులు టికెట్ల కోసం రెడీ అవుతున్నారు. అయితే వైసీపీ కొన్ని స్పెషల్ కేసులకు మాత్రమే వారసులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

అంతే తప్ప మొత్తానికి మొత్తం వారసులకు టికెట్లు ఇస్తూ పోతే పార్టీ సంగతేంటి అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ఇక రామచంద్రాపురంలో చూసుకుంటే ఎంపీ పిల్లి కుమారుడు కంటే మంత్రి వేణు బలమైన నేతగా ఉన్నారు. మంత్రిగా ఉంటూ వచ్చిన ఆయనకు టికెట్ నిరాకరించడం అన్నది కుదిరే వ్యవహారమే కాదు అని అంటున్నారు. పైగా జగన్ కి వీర విధేయుడుగా శెట్టి బలిజ సామాజికవర్గంలో పిల్లి తరువాత తరం ప్రతినిధిగా ఉన్న మంత్రి వేణుకే టికెట్ అని కన్ ఫర్మ్ చేస్తున్నారు అని అంటున్నారు.

మరి మంత్రి వేణు పోకడలను గిట్టని ఎంపీ పిల్లి ఆయన వర్గీయులు సీఎం జగన్ తో భేటీ అనంతర పరిణామాలతో ఊరుకుంటారా అన్నదే చర్చకు వస్తోంది. అయితే వైసీపీ హై కమాండ్ ఒక విస్పష్టమైన నిర్ణయం తీసుకున్న తరువాత అది అంతటితో ఆగాల్సిందే అంటున్నారు. అలా కాదు కూడదు అనుకుంటే రామచంద్రాపురంలో వైసీపీ రాజకీయం చాలా కీలకంగా మారడం ఖాయమనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

ఇవన్నీ చూస్తూంటే పిల్లి లొల్లి కాదు కానీ టోటల్ గా ఏపీలోని వైసీపీ వారసులకే ఇపుడు అతి పెద్ద బ్రేక్ పడిపోయింది అని అంటున్నారు. దీంతో చాలా మంది వారసులకు ఇది నిరాశను కలిగించే విషయంగా ఉంది అంటున్నారు.