Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దూకుడు.. ముగ్గురు ఎమ్మెల్సీలకు క్లాస్!

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై మండలిలో దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీలకు అధిష్టానం క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   28 Feb 2026 12:00 AM IST
ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దూకుడు.. ముగ్గురు ఎమ్మెల్సీలకు క్లాస్!
X

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై మండలిలో దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీలకు అధిష్టానం క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ సీనియర్ నేతతో దూకుడుగా వ్యవహరించడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని అధిష్టానం పెద్దలు అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. ఈ విషయంపై టీవీల్లో కథనాలు చూసిన వెంటనే సమాచారాన్ని తెప్పించుకుందని, తమ ఎమ్మెల్యేలది తప్పు లేకపోయినా, దురుసుగా ప్రవర్తించినట్లు కనిపించడమే తప్పుడు ప్రచారానికి కారణమైందని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వడమే కాకుండా, పార్టీకి నష్టం జరకుండా నష్టనివారణ కార్యక్రమం చేపట్టాలని ఎమ్మెల్సీలకు హితబోధ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

శాసనమండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు దాడికి ప్రయత్నించారని ప్రచారం జరిగింది. దీనిపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే తాము ఎమ్మెల్సీ వీర్రాజుతో దురుసుగా ప్రవర్తించకపోయినా, మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని వైసీపీ ఎమ్మెల్సీలు వివరణ ఇస్తున్నారు. తమ ప్రశ్నపై చర్చ ముగియకుండానే వీర్రాజు మైక్ తీసుకోవడంపై తాము నిరసన తెలిపామే కాని దాడి చేయలేదని వివరణ ఇస్తున్నారు.

అయితే ఈ సంఘటన పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీ వీర్రాజు సైతం తన పట్ల వైసీపీ ఎమ్మెల్సీలు దురుసుగా వ్యవహరించారని ప్రకటన చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ ను సాగదీయకుండా ముగించాలని వైసీపీ అధిష్టానం తన పార్టీ ఎమ్మెల్సీలకు సూచించినట్లు చెబుతున్నారు. బీజేపీతో జాతీయ స్థాయిలో స్నేహం కొనసాగుతుండటం, ఆ పార్టీతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివాదాన్ని ముగించాలని ఎమ్మెల్సీలకు ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గి సోము వీర్రాజుతో తాము ఘర్షణకు దిగలేదని వివరణ ఇస్తున్నారని అంటున్నారు.

బీజేపీ నేత సోము వీర్రాజుతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మిడి ఇజ్రాయెల్, పాలవలస విక్రాంత్, రమేష్ యాదవ్ ఈ విషయంపై మీడియా చిట్ చాట్ లో తమ వివరణ ఇచ్చుకుంటున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు తమ జిల్లా వారని, ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ వ్యాఖ్యానిస్తున్నారు. తమ జిల్లాకు చెందిన నేతతో తాను ఎందుకు తగాదా తెచ్చుకుంటానని ఇజ్రాయెల్ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అదే సమయంలో తాము సోము వీర్రాజు మాటలకు అడ్డు పడ్డామే కానీ దాడికి వెళ్లలేదని రమేష్ యాదవ్, విక్రాంత్ వివరిస్తున్నారు.

దీంతో బీజేపీ నేత సోము వీర్రాజు విషయంలో వైసీపీ పునరాలోచనలో పడినట్లు ఉందని అంటున్నారు. వాస్తవానికి సోము వీర్రాజుతో వైసీపీ పెద్దలకు మంచి సంబంధాలే ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. బీజేపీ పెద్దలతో అనుబంధం కొనసాగాలంటే సోము వీర్రాజు వంటివారిని మచ్చిక చేసుకోవాల్సివుంటుందని వైసీపీ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగానే ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో అనుబంధం ఉన్న సోము వీర్రాజుతో తగాదా తెచ్చుకోవడం కరెక్టు కాదని తమ ఎమ్మెల్సీలకు క్లాస్ పీకారాని చెబుతున్నారు.