Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్సీలు ఔట్‌!

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి అసెంబ్లీలో సంఖ్యా బ‌లం లేదు. 2024లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో ఆ పార్టీ 11 స్థానాల‌కే ప‌రిమితం అయింది.

By:  Garuda Media   |   6 July 2026 7:00 PM IST
వైసీపీ నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్సీలు ఔట్‌!
X

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి అసెంబ్లీలో సంఖ్యా బ‌లం లేదు. 2024లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో ఆ పార్టీ 11 స్థానాల‌కే ప‌రిమితం అయింది. దీంతో శాస‌న మండ‌లిలోనే ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీబ‌లంగా పోరాడుతోంది. అయితే.. కొంద‌రు ఎమ్మెల్సీలు ఇప్ప‌టికే రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌గా.. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం కూడా పూర్తికానుంది. దీంతో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరం కానున్నారు.

వారే.. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు. క‌ర్నూలుకు చెందిన శాస‌న మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ జకియాఖానుం. వీరిద్ద‌రి ప‌ద‌వీ కాలం ఈ నెల 28తో ముగియ‌నుంది. దీంతో త్వ‌ర‌లోనే మండ‌లి స‌భ్యుల కోసం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంద‌ని.. అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక ల‌సంఘానికి పంపించిన‌ట్టు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు చెబుతున్నారు.

కూట‌మికే!

వైసీపీ నుంచి విర‌మ‌ణ పొందుతున్న ఇద్ద‌రు అభ్య‌ర్థులు త‌ప్పుకొంటే.. ఆ రెండు ప‌ద‌వులు సంఖ్యాబలం ఎక్కువ‌గా ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూట‌మికే ద‌క్క‌నున్నాయి. దీంతో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీలే ఈ రెండు ప‌ద‌వుల‌ను ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ఈ రెండు స్థానాల్లో రెండు కూడా టీడీపీనే తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు ఇప్ప‌టికే అవ‌కాశం ఇచ్చిన ద‌రిమిలా.. త్వ‌ర‌లోనే ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థులే ఉంటార‌ని అంటున్నారు.

తెర‌మీదికి చాలా మంది..

ఈ నేప‌థ్యంలో తెర‌మీదికి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. పిఠాపురం టికెట్‌ను త్యాగం చేసిన వ‌ర్మ‌, మైల‌వ‌రం టికెట్‌ను త్యాగం చేసిన దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ప్ర‌స్తుతం క‌డ‌ప ఎమ్మెల్యేగా ఉన్న మాధ‌వీరెడ్డి భ‌ర్త‌.. శ్రీనివాస‌రెడ్డి పేర్లు ముందు వ‌రుసలో ఉన్నాయి. ఇక‌, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్య పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. ఇదేస‌మ‌యంలో బీసీల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని.. అదేస‌మయంలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఈ కోటాల నుంచి కూడా ప‌దుల సంఖ్య‌లో పేర్లు వెలుగు చూస్తున్నాయి.