వైసీపీలో ఉండలేరు.. టీడీపీకి వెళ్లలేరు.. ఏపీలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులను వదులుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 15 Sept 2025 5:00 AM ISTముందు నుయ్యి.. వెనక గొయ్యి.. అన్న చందంగా వైసీపీలో కొందరి ఎమ్మెల్సీల పరిస్థితి తయారైందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉండగా, రకరకాల కారణాలతో ఎమ్మెల్సీ పదవులు పొందిన వారు.. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నుంచి అక్కడ ఉండలేక.. అధికార టీడీపీలో చేరలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు చెబుతున్నారు. వైసీపీలో ఉండగా, వ్యవహరించిన తీరు వల్ల టీడీపీలోకి రాకుండా రెడ్ సిగ్నల్ వేస్తుండటం.. వైసీపీలో తమకు రాజకీయ భవిష్యత్తు లేదన్న ఆలోచనతో ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. అయితే టీడీపీలో చాన్స్ వస్తుందనే ఆత్మ విశ్వాసంతో ముందుగా రాజీనామాలు ప్రకటించిన వారు.. ఆ తర్వాత అక్కడ తమకు చాన్స్ లేదని తెలుసుకుని షాక్ గురవుతున్నారు. ఇలాంటి వారు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత తాజాగా బీజేపీలో చేరారు. దాదాపు ఏడాది కిందటే ఆమె తన పదవికి పార్టీకి రాజీనామా చేసినా ఇప్పటివరకు ఆమె ఏ పార్టీలో చేరకపోవడానికి కారణం టీడీపీలో చేరేందుకు అవకాశం వస్తుందని ఆశతో ఎదురుచూడటమే అంటున్నారు. చివరికి ఎంత ఓపికగా ఉన్నప్పటికీ తనపట్ల టీడీపీ అధిష్టానం సానుకూలంగా లేకపోవడంతో చివరికి తనను తాను రక్షించుకునేందుకు ఆమె బీజేపీలో చేరినట్లు అభిప్రాయపడుతున్నారు. పోతుల సునీత ఒక్కరే కాదు.. వైసీపీకి రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్సీలు టీడీపీలోకి వెళ్లకుండా ఆయా నియోజకవర్గ నేతలు అడ్డుకుంటున్నారని అంటున్నారు. దీంతో చేసేది లేక కమలం గూటికి వెళుతున్నారని అంటున్నారు.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులను వదులుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజ్యసభకు రాజీనామా చేసిన నలుగురిలో ఇద్దరు టీడీపీకి ఒకరు బీజేపీలోకి వెళ్లారు. సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరలేదు. దీనికి కారణం తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించడమే. ఇక ఎమ్మెల్సీల విషయానికి వస్తే చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ ఒక్కరికే టీడీపీ నుంచి ఆహ్వానం అందిందని అంటున్నారు.
టీడీపీలోకి వెళ్లాలని తెగ ప్రయత్నాలు చేసిన పోతుల సునీత, జఖియా ఖానం, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణకు అటు వైపు నుంచి సానుకూల సంకేతాలు అందలేదని అంటున్నారు. దీంతో ఇన్నాళ్లు వేచిచూసిన పోతుల సునీత, జఖియా ఖానం బీజేపీ గూటికి చేరారని చెబుతున్నారు. జయంగళం వెంకటరమణ జనసేనలో చేరతారని చెబుతున్నా.. ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టీడీపీలోకి వెళతారని అనుకున్న బల్లి బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజకీయ అడకత్తెరలో పోకచెక్కలా మారిందని అంటున్నారు. వారు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్లకుండా రాజకీయంగా ఒంటరి అయ్యారని అంటున్నారు.
అయితే ఎమ్మెల్సీలు టీడీపీలోకి వస్తామన్నా వారిని చేర్చుకోడానికి ఆ పార్టీ ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశం అవుతోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. స్థానికంగా నియోజకవర్గాల్లో ఖాళీ లేకపోవడం ఒక కారణమైతే.. వైసీపీలో ఉండగా వారు శ్రుతిమించిన విమర్శలు చేశారన్న ఆగ్రహం టీడీపీ అధిష్టానంలో ఉందంటున్నారు. మొత్తానికి టీడీపీలో చాన్స్ లేక బీజేపీలోకి వెళుతున్న నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
