వైసీపీకి అసెంబ్లీలో పెద్దిరెడ్డి సారధ్యం ?
శాసనమండలిలో బొత్సకు ఏ విధంగా విపక్ష బాధ్యతలు అప్పగించారో అలాగే అసెంబ్లీలో మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
By: Satya P | 11 Feb 2026 2:02 PM ISTఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు రావడం లేదు అన్నది కూటమి గత ఇరవై నెలలుగా చేస్తున్న తీవ్రమైన ఆరోపణ. ఇది మొదట్లో వైసీపీ లైట్ తీసుకున్నా జనాల్లో అయితే దాని ఇంపాక్ట్ గట్టిగానే ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలన్న ఒత్తిడి బాగా పెరిగింది. ఇక బడ్జెట్ సెషన్ కి 2025 లో ఒకసారి హాజరైన జగన్ అండ్ కో ఏడాది తరువాత మళ్లీ బడ్జెట్ సెషన్ కి హాజరయ్యారు. ఇక బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల రోజులూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ నాయకత్వంలో హాజరవుతారా అన్నది చర్చగా ఉంది. అయితే వైసీపీలో దీని మీద తర్జన భర్జన సాగుతోంది.
జగన్ నయా ప్లాన్ :
వైసీపీకి శాసన మండలిలో ఆధిక్యత ఉంది. దాంతో అక్కడ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష హోదా దక్కింది. ఆయన్ని ముందు పెట్టి వైసీపీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అదే అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం ఎవరూ సభకు హాజరు కావడం లేదు, దాంతో పాటు రిజిష్టర్ లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అని ఎథిక్స్ కమిటీ కూడా ముందుకు వచ్చిన నేపథ్యం ఉంది. ఇక మీదట డిజిటల్ అటెండెన్స్ అని అంటున్నారు. ఈ క్రమంలో అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా వైసీపీ సభకు హాజరై ప్రజా సమస్యలను నిలదీయాలన్న జనం నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధినేత జగన్ నయా వ్యూహాన్ని రచించారు అని అంటున్నారు.
సీనియర్లకు బాధ్యతలు :
శాసనమండలిలో బొత్సకు ఏ విధంగా విపక్ష బాధ్యతలు అప్పగించారో అలాగే అసెంబ్లీలో మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల సామాజిక న్యాయ సమీకరణలు సైతం సరిపోతాయని ఇద్దరు సీనియర్ల నాయకత్వంలో ఉభయ సభలలో ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీయడానికి వీలు అవుతుందని ఆలోచిస్తున్నారుట. అంతే కాదు పెద్దిరెడ్డి నాయకత్వంలో మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సభకు హాజై వారి నియోజకవర్గం సమస్యలు సభ దృష్టికి తీసుకుని రావడం ద్వారా తమ నియోజకవర్గాల్లో గ్రాఫ్ పెంచుకునే వీలు ఉంటుందని భావిస్తున్నారుట. ప్రజా సమస్యలు సభలో ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టినట్లుగా కూడా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారుట. ఇక జగన్ సభకు హాజరవుతారా లేదా అంటే అది కూడా వైసీపీ ఆలోచిస్తోందిట. కీలక సందర్భాలలో ఆయన సభకు రావచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ బడ్జెట్ సెషన్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావాలని చూస్తున్నారు అన్నది కీలకమైన విషయం. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
