Begin typing your search above and press return to search.

సభకు రాకుండా సంతకాలా..? వైసీపీ సభ్యులపై ఎథిక్స్ కమిటీ ఫోకస్

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకోవడంపై పెద్ద రచ్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 Sept 2025 7:10 PM IST
సభకు రాకుండా సంతకాలా..? వైసీపీ సభ్యులపై ఎథిక్స్ కమిటీ ఫోకస్
X

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకోవడంపై పెద్ద రచ్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇన్నాళ్లు రాజకీయ విమర్శలు చేసిన అధికారపక్షం.. విపక్ష ఎమ్మెల్యేలను నైతికంగా ఇబ్బంది పెట్టింది. అయితే ఇప్పుడు సభకు గైర్హాజరు అవుతూ సంతకాలు ఎలా తీసుకుంటారనే చర్చను మరింత విస్తృతం చేసేలా అడుగులు వేస్తోంది. అలా జీతాలు తీసుకోవడం నైతికమా? కాదా? అనేది చర్చిద్దాం అంటూ శాసనసభ తొలి ఎథిక్స్ కమిటీలోనే ప్రస్తావన వచ్చింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల జీతాల ఇష్యూపై ప్రభుత్వం సీరియస్ గానే ఉందని ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ముందు ఎమ్మెల్యేలు సమావేశాలకు రాకుండా జీతాలు తీసుకోవడంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభ్యంతరం తెలిపారు. పనిచేయకుండా వేతనాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుతూ స్పీకర్ వాగ్బాణాలు సంధించారు. ఆయనకు మద్దతుగా కూటమి నేతలు సైతం రంగంలోకి దిగారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు వద్దు కానీ, ప్రజాధనం జీతాలుగా కావాలా? అంటూ విమర్శలు గుప్పించారు.

ఈ పరిస్థితుల్లో వర్షాకాల సమావేశాల్లో జీతాల అంశమే తుఫానుగా మారే సూచనలు కనిపించాయి. అంతకుముందు సభకు వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామని అధికార పక్షం హెచ్చరించింది. అయితే విపక్షం ఈ రెండింటినీ బెదిరింపుగానే పరిగణించింది. అనర్హత ఎలా వేస్తారో చూస్తామని సవాల్ విసిరింది. ఇక తమ అధినేతకు విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తామని పునరుద్ఘాటించింది. అయితే సభకు రామని మొండిపట్టుదల ప్రదర్శించిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరైనట్లు సంతకాలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సభలో కనిపించని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతున్నట్లు సంతకాలు చేయడాన్ని అధికార పక్షం తప్పుబడుతోంది. జీతాలు కోసమే వారు ఇలా సంతకాలు చేస్తున్నారని కొందరు, అనర్హత వేటు నుంచి తప్పించుకోడానికే సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్యే మంగళవారం శాసనసభ ఎథిక్స్ కమిటీ తొలిభేటీ జరిగింది. వైసీపీ సభ్యులు సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడంపై చర్చ జరిగింది.

ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, బత్తుల బలరామక్రిష్ణ సమావేశమై వైసీపీ సభ్యుల తీరుపై చర్చించారు. వచ్చే సమావేశం నాటికి సభ్యుల హాజరు పట్టీని తమ ముందు ఉంచాలని శాసనసభ సెక్రటేరియట్ ను కమిటీ సభ్యులు ఆదేశించారు. దీంతో వైసీపీ సభ్యుల హాజరుపై పెద్ద రాజకీయ దుమారం చెలరేగే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇది ఎంతవరకు వెళుతుందనేది ఉత్కంఠగా మారిందని చెబుతున్నారు.