డీలిమిటేషన్ పై వైసీపీ కీలక సూచనలు.. లోక్ సభలో మిథున్ రెడ్డి ప్రసంగం
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటులో జరుగుతున్న చర్చలో వైసీపీ తరపున రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.
By: Tupaki Political Desk | 17 April 2026 3:46 PM ISTనియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటులో జరుగుతున్న చర్చలో వైసీపీ తరపున రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు భేషరతుగా వైసీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో మాత్రం రాష్ట్రానికి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లును దేశాన్ని పునఃనిర్మించడానికి ఉపయోగించాలని కోరారు. ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా బిల్లును వాడొద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.
చట్టంలో స్పష్టత ఉండాలి
మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవిభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించలేదని గుర్తు చేశారు. 50 శాతం సీట్ల పెంపు అంశాన్ని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. అదేసమయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా సీట్ల పంపిణీ జరగాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో ఏపీకి ఒక్కసీటు తగ్గినా రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడించారు.
వైసీపీ ఆధ్వర్యంలో 50 శాతం
కాగా, కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషణ్ బిల్లుతోపాటు డీలిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఏపీలో తమ పార్టీ అధికారంలో ఉండగా మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని ఆ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వెల్లడించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతోపాటు అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, మహిళల పేరిట ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు.
వీడని ఉత్కంఠ
మరోవైపు పార్లమెంటు ఉభయ సభల్లో డీలిమిటేషన్, మహిళా బిల్లుపై వాడివేడి చర్చలు కొనసాగుతున్నాయి. లోక్ సభలో విపక్షం గట్టిగా వ్యవహరిస్తుండటంతో మహిళా బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సభలో 540 మంది సభ్యులు ఉండగా, ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యులు ఉన్నారు. విపక్షాల బలం 233గా ఉంది. 2/3 మెజార్టీ ఉంటేనే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందని చెబుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ పై ఎన్డీఏ ధీమాగానే కనిపిస్తోంది. మెజార్టీ సాధించేందుకు అవసరమైన 67 మందిని ఎలా కూడగడుతుందనేది సస్పెన్స్ గా మారింది. ఇదే సమయంలో మహిళా బిల్లుపై ఎంపీలు ఆలోచించి ఓటు వేయాలని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో అభ్యర్థించారు.
