కుప్పం ఎఫెక్ట్: తొడగొట్టి.. పడిపోయిన వైసీపీ ..!
అయితే.. ఎన్నికల తర్వాత.. ఇప్పటికి 10 మాసాలు అయినప్పటికీ.. వైసీపీ నాయకుల జాడ ఎక్కడా కనిపించడం లేదు.
By: Tupaki Desk | 23 April 2025 6:30 PMతొడగొట్టడం.. రాజకీయాల్లో కామనే. ఒకరిపై ఒకరు ప్రత్యర్థులు సవాళ్ల రాజకీయాలు చేసుకోవడం కామనే. అయితే.. ఇవి మున్ముందు కొనసాగుతాయా? అంటే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా.. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మాత్రం తొడగొట్టిన వైసీపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించడం లేదు. వైసీపీ హయాంలో ఇంకేముంది.. చంద్రబాబును ఇంటికి పంపిస్తామని శపథాలు చేసిన వారు ఉన్నారు.
అయితే.. ఎన్నికల తర్వాత.. ఇప్పటికి 10 మాసాలు అయినప్పటికీ.. వైసీపీ నాయకుల జాడ ఎక్కడా కనిపించడం లేదు. కుప్పం వైసీపీ ఇంచార్జ్.. ఎమ్మెల్సీ భరత్ కూడా.. ఇప్పటి వరకు కనిపించలేదు. పైగా.. ఆయన ఏర్పాటు చేసిన కార్యాలయం కూడా.. హోటల్‌గా మారిపోయింది. ఇక, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా.. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇక్కడ నుంచే కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల దానికి అద్దెలు చెల్లించకపోవడంతో ఆ ఇంటికి కూడా తాళం వేశారు.
మరోవైపు.. చిత్తూరు మాజీ ఎంపీ ఎడ్డప్ప.. కూడా కుప్పంలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఆయన తరచుగా ఇక్కడ పర్యటించి.. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఒకరకంగా చెప్పాలంటే.. చంద్రబాబు ను ఇంటికి పంపించేందుకు తయారైన నాయకగణాన్ని కూడా.. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పే తయారు చేశారు. మరోవైపు.. మాజీ మంత్రి నారాయణ స్వామి కూడా.. ఈ తొడ గొట్టుడు రాజకీయాల్లో ముందున్నారు. కానీ, ఇప్పటి వరకు ఆయన కూడా.. బయటకు రాలేదు.
అయితే.. ఇప్పుడు ఎందుకు.. ఇదంతా అంటారా? గత ఎన్నికలకు ముందు.. వైసీపీ జెండా ఎగిరిన వంద లాది ఇళ్లపై ఇప్పుడు టీడీపీ జెండా ఎగురుతోంది. అంతేకాదు.. టీడీపీ నామస్మరణే కనిపిస్తోంది. ఎవరూ కూడా.. వైసీపీ గురించి ఆలోచనే లేకుండా పోయింది. ఒకప్పుడు.. చంద్రబాబు పేరు ఎత్తేందుకు.. టీడీపీ జెండా పట్టేందుకు భయపడిన పల్లెల్లో ఇప్పుడు తెలుగు దేశం నామస్మరణే కనిపిస్తోంది. పార్టీ కార్యాలయాల్లోనూ సందడి నెలకొంది. అందుకే.. తొడగొట్టిన వైసీపీ నాయకులు పడిపోయారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.