జగన్‌కు షాక్: బాలాజీ గోవిందప్ప అరెస్టు.. ఎవరీయన?
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. దీనిపై కేసు నమోదు చేసింది.
By: Tupaki Desk | 13 May 2025 2:33 PM ISTవైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు, జగన్ సతీమణిభారతి నేతృత్వంలోని భారతీ సిమెంట్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్.. ఆ కంపెనీ ఆడిటర్ కూడా అయిన.. బాలాజీ గోవిందప్పను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈపరిణామం..వైసీపీ అధినేతకు షాకిచ్చింది. ఏపీ పోలీసుల కళ్లు గప్పి.. మైసూరులో దాక్కున్న బాలాజీ గోవిందప్పను పక్కా సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు.. అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను ఏపీకి తీసుకువస్తున్నారు.
ఏంటీ కేసు?
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. దీనిపై కేసు నమోదు చేసింది. ఆ వెంటనే దీనిని విచారించేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబుతో కలిసి.. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే విచారణ ముమ్మరంగా సాగింది. మద్యం కుంభకోణంలో ఏకంగా 3200 కోట్ల రూపాయలు గోల్‌మాల్ జరిగినట్టు సిట్ గుర్తించింది. కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతని నుంచి మరింత సమాచారం సేకరించారు.
ఈ క్రమంలోనే నాటి అధికారి.. ధనుంజయ్‌రెడ్డి, అప్పటి జగన్ ఓఎస్‌డీ గా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్పలపై కేసులు నమోదు చేసింది. అయితే.. ఈ కేసులో వారి పేర్లు నమోదైన వెంటనే వారు తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి వెతుకులాట ప్రారంభమైంది. అయితే.. తమకు ముందస్తు బెయిల్ కావాలని.. ముగ్గురు నిందితులు.. హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించి నా.. ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలో ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఈ ముగ్గురి ఇళ్లకు వెళ్లి నోటీసులు అందించారు. అయితే.. వారు విచారణకు గైర్హాజరయ్యారు. అయినప్పటికి సిట్ అధికారులు వదిలి పెట్ట కుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలాజీ గోవిందప్ప మైసూరులో ఉన్నట్టు గుర్తించి.. అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మద్యం ద్వారా అందిన ముడుపులను... తన ఆడిటింగ్ నైపుణ్యంతో గోవిందప్ప దేశాలు దాటించారని పోలీసులు భావిస్తున్నారు.
