Begin typing your search above and press return to search.

వైసీపీ మండలి వ్యూహం...కూటమికి చుక్కలేనా ?

వైసీపీకి ఇపుడు శాసన మండలి అతి పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీకి ఎటూ వెళ్ళే సమస్య లేదు.

By:  Tupaki Desk   |   29 Sept 2025 9:25 AM IST
వైసీపీ మండలి వ్యూహం...కూటమికి  చుక్కలేనా ?
X

వైసీపీకి ఇపుడు శాసన మండలి అతి పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీకి ఎటూ వెళ్ళే సమస్య లేదు. కేవలం పదకొండు మందిని పెట్టుకుని వెళ్తే మైక్ ఇవ్వరని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. పైగా బలమైన కూటమి నుంచి విమర్శలు అవమానాలు ఎన్నో ఎదురవుతాయని కూడా ఆలోచిస్తున్నారు. దాంతో మండలి నుంచే టీడీపీ కూటమిని ఇరుకున పెట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.

కూటమి మైనారిటీలో :

మండలిలో కూటమికి కేవలం పదమూడు మంది మాత్రమే ఉన్నారు. ఇందులో పది మంది టీడీపీకి చెందిన వారు అయితే ఇద్దరు జనసేన ఒకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఇక మొత్తం మండలిలో 58 మంది సభ్యులు ఉంటే అందులో గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన వారితో కలుపుకుని 35 మంది వైసీపీకి ఉన్నారు. ఇందులో ఆరుగురు గడచిన పదిహేను నెలలలో రాజీనామా చేశారు. దాంతో వాస్తవానికి వైసీపీ బలం మండలిలో 29కి పడిపోయింది. అయితే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించకపోవడంతో టెక్నికల్ గా అదే నంబర్ వైసీపీకి మండలిలో ఉంది.

ఆరుగురూ వేరే పార్టీలలోకి :

తాజాగా చూస్తే మర్రి రాజశేఖర్ కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరిపోయారు. తాజాగా పోతుల సునీత బీజేపీలో చేరారు. అంతకు ముందే జకియా ఖానం బీజేపీ తీర్ధం పుచ్చుకుంటే జయ మంగళ వెంకట రమణ జనసేనకు జై కొట్టారు. ఇలా ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనాలు చేసి వేరే పార్టీ కండువా కప్పుకున్నా చైర్మన్ మోషెన్ రాజు మాత్రం వారి రాజీనామాలను ఆమోదించడం లేదు. దీని మీద జయ మంగళ వెంకట రమణ వంటి వారు కోర్టులకు వెళ్ళినా కూడా రాజీనామాల విషయం అయితే తేలడం లేదు.

ఓకే అంటే షాకే :

ఈ ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు అన్న పట్టుదలతో వైసీపీ ఉంది. ఆ పార్టీకి చెందిన చైర్మన్ కూడా ఆమోదించకుండా పరిశీలనలో ఉంచారు. ఒకవేళ ఆమోదిస్తే కనుక ఈ ఆరు ఖాళీలలో కూటమి ఎమ్మెల్సీలు వస్తారు. దాంతో మండలిలో కూటమి సంఖ్య ఒకేసారి 19కి పెరుగుతుంది. ఇక వీరి రాజీనామాలు ఆమోదిస్తే కనుక వైసీపీ నుంచి మరింత మంది రాజీనామాలు చేసే చాన్స్ ఉందని ఆలోచిస్తున్నారు. అలా కూటమికి కనుక మండలిలో మెజారిటీ వస్తే వైసీపీకి అక్కడ కూడా గట్టిగా పోరాడే అవకాశం పోతుంది. పైగా బిల్లులను ఆపే పరిస్థితి ఉండదు, తాజాగా ఒక బిల్లుని వైసీపీ మండలిలో ఆపించింది. ఇక ధాటీగా వాదనలు వినిపిస్తూ కూటమిని ఇరుకున పెడుతోంది.

అప్పటి వరకూ ఇదే తీరు :

ఇక మండలిలో ఖాళీలు అయితే ఇప్పట్లో లేవు. 2027లోనే పెద్ద ఎత్తున ఉంటాయి. అప్పటివరకూ ఇదే తీరున తమ పట్టుని గట్టిగా బిగించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. మండలిలో కూటమిని ఇరకాటం పెట్టాలీ అంటే తమ బలం చేజారకూడదని భావిస్తోంది. ఇక చైర్మన్ మోషెన్ రాజు ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా 2027తోనే ముగుస్తుంది. దాంతో కూటమికి అప్పటి వరకూ చుక్కలు చూపించాలని వైసీపీ నిర్ణయించుకుంది అని అంటున్నారు. అప్ప్పటికి సార్వత్రిక ఎన్నికలు దగ్గరలో ఉంటాయి కాబట్టి ఏమి జరిగినా ఫరవాలేదని భావిస్తోంది. అందుకే ఎమ్మెల్సీలలో ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకున్నా వైసీపీ జస్ట్ వాచ్ చేస్తోంది తప్ప ఏమీ రియాక్షన్ అయితే ఇవ్వడం లేదని అంటున్నారు. దీని వెనక వ్యూహం పక్కాగా ఉండడమే ఇందుకు కారణం అంటున్నరు.