డియర్ కామ్రేడ్ అంటున్న వైసీపీ
వైసీపీ ఏపీలో సింగిల్ గానే ఉంది. పార్టీ పెట్టి దాదాపుగా పదిహేనేళ్ళు కావస్తోంది. ప్రతీ ఎన్నికలోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది.
By: Satya P | 29 Jan 2026 4:00 AM ISTవైసీపీ ఏపీలో సింగిల్ గానే ఉంది. పార్టీ పెట్టి దాదాపుగా పదిహేనేళ్ళు కావస్తోంది. ప్రతీ ఎన్నికలోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. రిజల్ట్ ఎలా ఉన్నా తీసుకుంది. అలాగే ముందుకు సాగింది. కానీ 2024 ఎన్నికలు వైసీపీకి బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ని మిగిల్చాయి. అయితే టీడీపీ కూటమి విడిపోతుందని ఎవరికి వారే అవుతారని వేసుకున్న అంచనాలు అయితే ఇపుడు తప్పుతున్నాయి. ఏకంగా మరో పదిహేనేళ్ల పాటు కూటమి కలసి ఉంటుందని పెద్దలు అంతా ఒకే మాటగా చెబుతున్నారు.
అందరిదీ ఆదే మాట :
నిన్నటికి నిన్న టీడీపీ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధుల వర్క్ షాప్ లో మంత్రి నారా లోకేష్ ఇదే మాట చెప్పారు. విడాకులు అన్న ప్రసక్తి లేదని అంతా కలసి ముందుకు సాగుతామని, ఏవైనా ఇబ్బందులు ఉంటే స్థానికంగా సర్దుబాటు చేసుకుని ఒకే బాటగా ఒకే త్రాటి మీద అంతా కలసి నడవాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెబుతూ వస్తున్నారు. ఏపీలో పదిహేనేళ్ళ కూటమి పాలన సాగాలని బలంగా కోరుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు కూడా చెబుతోంది ఇదే. రాష్ట్రం బాగు పడాలీ అంటే కూటమికే అధికారం కొనసాగించాలని తాము అంతా కలసి కట్టుగా ఉన్నామని అంటున్నారు.
వైసీపీలో కొత్త ఆలోచనలు :
ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు వైసీపీకి 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన రాజకీయం అయితే జరుగుతుందని నమ్మకం సడలుతోంది. కూటమిలో నాడు ఒక్కో పార్టీ బయటకు వచ్చి విడిగా చివరికి పోటీ చేశాయి. దాంతో వైసీపీకి బంపర్ విక్టరీ దక్కింది. 2029 లో అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. పైగా కూటమి బలంగా ఉంటే వైసీపీకి అధికారం దక్కడం కష్టమని కూడా మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంటి వారు చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ వైసీపీ గతానికి భిన్నంగా ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
వామపక్షాలతో కలిసి :
వైసీపీ ఇక మీదట వామపక్షాలతో కలసి అడుగులు వేస్తుందా అన్న చర్చ కూడా మొదలవుతోంది. వామపక్షాలు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల మీద గట్టిగా పనిచేస్తూ ఉంటాయి. వాటికి కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి. ప్రజలలో ఏ అంశం అయినా బలంగా చొచ్చుకుని పోవడానికి వామపక్షాల పోరాటాల తీరే కారణం అని చెబుతారు. ఈ క్రమంలో వైసీపీ వామపక్షాలతో కలసి కూటమి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటాలు చేస్తే మరింతగా అవి జనంలోకి వెళ్ళి వైసీపీకి పొలిటికల్ గా మైలేజ్ దక్కుతుందని భావిస్తున్నారు.
విశాఖ నుంచే శ్రీకారం :
విశాఖలో తమ వారికి అస్మదీయులకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారంటూ వైసీపీ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖలో భూ దందా అంటూ త్వరలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. ఈ పోరాటంలో వామపక్షాలను కూడా కలుపుకుని పోవాలని చూస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు విశాఖలో ప్రభుత్వ భూములను ఒక ప్రైవేట్ సంస్థకు దారాదత్తం చేసేందుకు కూటమి సర్కార్ చూస్తోందని దానిని తాము ప్రతిఘటించి తీరుతామని ఆయన అన్నారు. ఈ విషయంలో వామపక్షాలను కూడా కలుపుకుని పోతామని చెప్పారు. ఈ విషయం మీద వామ పక్ష నాయకులతో కలసి పోరాడుతామని బొత్స చెప్పారు.
వారితో మాట్లాడుతున్నాం :
వామపక్షాలతో కలసి విశాఖలో భూ దందాల మీద పోరాటానికి మాట్లాడుతున్నామని బొత్స తెలియచేయడం విశేషం. ఈ విషయం మీద నా నాయకుడు మాట్లాడుతున్నారని బొత్స చెప్పారు. వామపక్షాలతో కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని కూడా స్పష్టం చేశారు. అలాగే మేధావులు విద్యావంతులు ఇతర ప్రజా సంఘాలతో కలసి పనిచేస్తామని చెప్పారు. మరి కామ్రేడ్స్ తో విశాఖలో మొదలవుతున్న ఈ బంధం రాష్ట్ర స్థాయిలో కూడా కొనసాగుతుందని అంటున్నారు. అంటే 2029 ఎన్నికల కంటే ముందే ఏపీలో టీడీపీ కూటమికి యాంటీగా వైసీపీ కూటమి కూడా రావచ్చు అన్న మాట అయితే వినిపిస్తోంది.
