వైసీపీ స్పెషల్: వారు ఇల్లు కథలరు.. పదవి వీడరు.. ఇదేం చిత్రం..!
వైసీపీలో నాయకులు కొందరు మౌనంగా ఉంటే.. మరికొందరు తమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 18 May 2025 2:00 AM ISTవైసీపీలో నాయకులు కొందరు మౌనంగా ఉంటే.. మరికొందరు తమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. పదవులు తీసుకోలేదని.. దక్కలేదని కొందరు ఆవేదనతో ఉంటే.. మరికొందరు పదవులు ఉండి కూడా మౌనంగా ఉంటున్నారు. దీంతో పార్టీ గురించి స్పందించేవారు.. మాట్లాడేవారు కూడా కరువయ్యారు. ప్రత్తిపాడు నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి మేకతోటి సుచరితకు అప్పగించారు. ఆమె గత ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు.
ఆ తర్వాత.. పార్టీ మారుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే.. అనూహ్యంగా పార్టీ ఆమెను బుజ్జ గించి.. ప్రత్తిపాడుకు పంపించింది. అయితే.. పార్టీ పగ్గాలు ఇచ్చినా.. సుచరిత మాత్రం ఇల్లు కదలడం లేదు. పార్టీ నాయకులతోనూ సమావేశాలు పెట్టడం లేదు. ఇటీవల జరిగిన మహిళా నాయకుల సమావేశా నికి కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఆమె ఉన్నారా? ఉండడం లేదా? ఉంటే పార్టీ కోసం పనిచేస్తారా? లేదా? అనేది కూడా సందేహంగా మారింది.
ఇక, మాజీ హోం మంత్రి తానేటి వనిత పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. గత ఎన్నికల్లో నియోజ కవర్గం మార్చినప్పటికీ.. ఎలాంటి బాధలేకుండా పోటీ చేసిన ఆమె.. అక్కడ ఓడిపోయారు. కానీ, తిరిగి కొవ్వూరుకు వచ్చేశారు. అయితే.. వైసీపీ హయాంలో ఎలాంటి వ్యతిరేకత ఉందో ఇప్పుడు కూడా వనితపై అదే వ్యతిరేకత కొనసాగుతోంది. నాయకులు ఆమెకు సహకరించడం లేదు. పోనీ.. ఆమె అయినా.. బయటకు రావాలి కదా? అంటే.. అది కూడా ఆమె చేయడం లేదు.
దీంతో కొవ్వూరులోనూ వైసీపీ రాజకీయాలు సైలెంట్‌గానే ఉన్నాయి. ఇక, గుంటూరు తూర్పు నియోజకవ ర్గంలో వైసీపీ నాయకుడు ముస్తాఫా కోరిక మేరకు.. ఆయన కుమార్తెకు గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చారు. కానీ, ఆమె కూడా ఓడిపోయారు. అయితే.. పార్టీని బలోపేతం చేసే విషయంలో మాత్రం ఆమె కూడా గడప దాటడం లేదనే టాక్ వినిపిస్తోంది. నెల కు ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. దీంతో వైసీపీ పరిస్థితి ఇక్కడ కూడా ఇబ్బందిగానే ఉంది. పోనీ.. వీరు తప్పుకొంటారా? వేరే వారికి అవకాశం ఇస్తారా? అంటే అది కూడా లేదు. దీంతో పార్టీ ఇబ్బందుల్లోనే ఉందని అంటున్నారు.
