Begin typing your search above and press return to search.

రాజకీయ జిల్లాలో వైసీపీ వీక్ అవుతోందా ?

ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసినా లేక అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తరువాత చూసినా రాజకీయ చైతన్యం అంతా అనకాపల్లి చుట్టూనే ఉంటూ వస్తోంది.

By:  Satya P   |   19 July 2026 10:06 AM IST
రాజకీయ జిల్లాలో వైసీపీ వీక్ అవుతోందా ?
X

ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసినా లేక అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తరువాత చూసినా రాజకీయ చైతన్యం అంతా అనకాపల్లి చుట్టూనే ఉంటూ వస్తోంది. ఎంతో మంది దిగ్గజ నేతలు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీగా పోటీ చేశారు. అంతే కాదు జాతీయ స్థాయి నాయకుల సభలు సమావేశాలు రాజకీయ చర్చలు అన్నీ కూడా అనకాపల్లి కేంద్రంగానే సాగుతూ వచ్చాయి. మొదటి నుంచి కూడా రాజకీయ జిల్లాగా అనకాపల్లికి ఎంతో పేరు ఉంది. అలాంటి రాజకీయ ఖిల్లా అయిన అనకాపల్లిలో వైసీపీ వీక్ గా ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

గట్టి నేతల కరవు :

అనకాపల్లి అంటేనే నాయకుల కేంద్రంగా చెబుతారు. అక్కడ నుంచే నాయకులు ఎంతో మంది తయారు అయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అలాంటి అనకాపల్లిలో ఇపుడు వైసీపీకి గట్టి నాయకుల కొరత పట్టి పీడిస్తోంది. సీనియర్ నేతలు అయితే పెద్దగా లేకపోవడం వల్ల వ్యూహాల లేమితో సతమతం అవుతోంది అని అంటున్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీ పుట్టుక నుంచి ఉంటూ ఆ పార్టీని బలోపేతం చేశారు. అయితే ఆయన 2014 ఎన్నికల తరువాత తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో ఆ పార్టీని పటిష్టం చేసే పనిలో సీరియస్ గా పనిచేస్తున్నారు. అలాగే మరో సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీ కంటే టీడీపీ బెటర్ అని ఈ వైపునకు వచ్చేశారు అని చెబుతారు.

సైలెంట్ మోడ్ లో అంతా :

ఇక వైసీపీలో ఉన్న నాయకులు చూస్తే వారంతా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. 2019 నుంచి 2024 దాకా అనకాపల్లి ఎంపీగా పనిచేసిన భీశెట్టి సత్యవతి పార్టీ యాక్టివిటీస్ లో పెద్దగా కనిపించడంలేదు. ఆమెకు పార్టీలో పదవులు వైసీపీ అధినాయకత్వం ఇచ్చినా కూడా ఎందుకో చురుకుగా వ్యవహరించడంలేదు అని అంటున్నారు. అలాగే 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూడి ముత్యాలనాయుడు కూడా గతంలో మాదిరిగా ఇపుడు యాక్టివ్ గా లేరు. ఆయన మాడుగుల నియోజకవర్గానికే పరిమితం అయిపోయారు. అక్కడ కూడా ఆయన జోరు నెమ్మదించింది అని అంటున్నారు. పాయకరావు పేట నుంచి రాజ్యసభ సభ్యుడిగా గొల్ల బాబూరావు ఉన్నా ఆయన కూడా పెద్దగా దూకుడు చేయడం లేదని అంటున్నారు. దాంతో అనకాపల్లి జిల్లా కేంద్రంగా వైసీపీ రాజకీయం అంతా పూర్వ పక్షంగా సాగుతోంది అన్న విమర్శలు ఉన్నాయని చెబుతున్నారు.

కూటమిని ఎదుర్కోవాలంటే :

ఇక మూడు పార్టీలతో కూటమి పటిష్టంగా ఉంది. అలాంటి కూటమిని ఎదుర్కోవాలీ అంటే వైసీపీ ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ కి సొంతంగా అంగబలం అర్ధబలం ఉన్నాయి. ఆయన రాయలసీమ నుంచి వచ్చినా అనకాపల్లిలో తనకంటూ ప్రత్యేక రాజకీయ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా జనసేన కూడా తన పలుకుబడిని విస్తరించుకుంటోంది. టీడీపీకి లెక్కలేనంత మంది నాయకులు ఉన్నారు. వారిని ఢీ కొట్టాలంటే వైసీపీకి బలం సరిపోవడం లేదని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ కాయ కల్ప చికిత్స చేయాల్సిందే అని అంటున్నారు. ఉన్న నాయకులను యాక్టివ్ మోడ్ లో ఉంచడంతో పాటు ఇతర పార్టీల నేతలను ఆకట్టుకోవడం ద్వారా రాజకీయ జిల్లాలో బలమైన స్వరాన్ని వినిపించగలదని అంటున్నారు.