Begin typing your search above and press return to search.

అక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్ క‌రువ‌య్యారే....!

రజిని వెళ్లిపోయాక గుంటూరు పశ్చిమ ఇన్చార్జిగా ఎవరిని నియమించలేదు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సమన్వయకర్తలేని ఏకైక నియోజకవర్గం గుంటూరు వెస్ట్ మిగిలిపోయింది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 9:15 AM IST
అక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్ క‌రువ‌య్యారే....!
X

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసిపి గత ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. పార్టీ ఓటమి తర్వాత చాలామంది నాయకులు కండువాలు మార్చేశారు. ఇదిలా ఉంటే గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఒక నియోజకవర్గ మాత్రం జగన్‌కు కొరకరాని కొయ్య‌గా మారింది. ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు జగన్ వైసీపీ జెండా ఎగరవేయలేకపోయారు. జగన్ పార్టీ పెట్టాక జరిగిన అన్ని ఎన్నికలలో అక్కడ వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోతూ తెలుగుదేశం జెండా ఎగురుతుంది.

అలాంటి చోట ఇప్పుడు వైసీపీ ఇన్చార్జిని నియమించుకోలేక సతమతమవుతోంది. ఆ నియోజకవర్గమే గుంటూరు వెస్ట్. ఈ నియోజకవర్గంలో పార్టీకి నాయకుల కొరత లేదు. గత ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాజీ మంత్రి విడుదల రజిని. తర్వాత అధిష్టానం ఆమెను ఆమె సొంత నియోజకవర్గం చిలకలూరిపేట సమన్వయకర్తగా పంపింది. అదే సమయంలో సత్తెనపల్లి ఇన్చార్జిగా ఉన్న మరో మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ప్రకటించారు జగన్.

రజిని వెళ్లిపోయాక గుంటూరు పశ్చిమ ఇన్చార్జిగా ఎవరిని నియమించలేదు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సమన్వయకర్తలేని ఏకైక నియోజకవర్గం గుంటూరు వెస్ట్ మిగిలిపోయింది. జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ గుంటూరులోనే రాజకీయం చేస్తున్న రాంబాబునే పశ్చిమ ఇన్చార్జిగా ప్రకటిస్తారని.. అందుకే ఖాళీగా ఉంచారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ రోజులు... నెలలు గడుస్తున్నా రాంబాబుకు ఆ పదవి ఇవ్వటం లేదు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ మేయర్ కావ‌టి మనోహర్ నాయుడు ఇలా చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు. వీరిలో అప్పిరెడ్డి ఏసురత్నంకు గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉంది.

మోదుగుల 2014లో టిడిపి తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా..! ఈ ముగ్గురికి గుంటూరు పశ్చిమంపై పూర్తి అవగాహన ఉంది. కానీ ఎవరికి ఎందుకు ఇంచార్జ్ ఇవ్వడం లేదో ఎవరికి తెలియడం లేదు. అయితే అంబటి రాంబాబు మాత్రం గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ పదవి తనకే వస్తుందని ప్రచారం చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అంబటి కంటే పైన చెప్పుకున్న నాయకులకే వెస్ట్ నియోజకవర్గం మీద గట్టి పట్ట ఉంది. మ‌రి గుంటూరు ప‌శ్చిమం నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఎవ‌రు వ‌స్తారు ? జ‌గ‌న్ ఎవ‌రి పేరు ప్ర‌క‌టిస్తారో చూడాలి.