వైసీపీలో వింత పరిస్థితి.. నియోజకవర్గ సమన్వయకర్తలు కావలెను!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వైసీపీలో తీవ్ర నిస్తేజాన్ని తీసుకువచ్చింది. 30 ఏళ్లు అధికారం గ్యారెంటీ అన్న కలలు కల్లలైపోవడంతో వైసీపీలో బాటమ్ టు టాప్ నేతలు అంతా డీలా పడ్డారు.
By: Tupaki Desk | 14 April 2025 12:55 PM ISTఅసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వైసీపీలో తీవ్ర నిస్తేజాన్ని తీసుకువచ్చింది. 30 ఏళ్లు అధికారం గ్యారెంటీ అన్న కలలు కల్లలైపోవడంతో వైసీపీలో బాటమ్ టు టాప్ నేతలు అంతా డీలా పడ్డారు. అయితే ఎన్నికలు ముగిసిన పది నెలలకు నేతలు కాస్త తేరుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కూడా బలోపేతంపై దృష్టి పెట్టింది. పార్టీలో కీలకమైన రాజకీయ సలహాల మండలిని పునర్ వ్యవస్థీకరించింది. అధినేతకు రాజకీయ సలహాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన పీఏసీలో దాదాపు 33 మందిని నియమించారు. ఇందులో అన్నివర్గాలు, ప్రాంతాల వారికి చోటివ్వడంతో తమ ఆలోచనలను పార్టీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని కేడర్ భావిస్తోంది. అయితే ఈ మార్పుతో పాటు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోవాలని సూచనలు వస్తున్నాయి.
ఎన్నికలకు 175/175 టార్గెట్ గా వైసీపీ ప్రచారం చేసుకుంది. అయితే సీట్ల సాధన అటుంచితే.. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో సగానికి పైగా ఇన్చార్జిలు లేకపోవడంతో కేడర్ డీలాపడుతున్నారు. రాజీనామాలో కొన్నిచోట్ల, ఎన్నికలకు ముందు చేసిన మార్పులతో కొన్నిచోట్ల ఇన్చార్జిలు లేకపోయారని అంటున్నారు. చిలకలూరిపేట, ఒంగోలు వంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జులను నియమించినప్పటికీ, ఇంకా చాలా చోట్ల సమన్వకర్తలు లేరనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా గత ఎన్నికలకు ముందు పార్టీ చేసిన మార్పులతో నియోజకవర్గాలు మారిన నేతలు.. అక్కడ ఉండలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు సుమారు 80 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇందులో కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందారు. సంతనూతలపాడులో తాటిపర్తి చంద్రశేఖర్, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ మాత్రమే ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికల ముందు చేసిన ప్రయోగం విఫలమైందనే అభిప్రాయమే ఎక్కువగా ఉంది. అయితే ఇలా మార్చిన వారిని మళ్లీ సొంత స్థానాలకు పంపడంలో వైసీపీ ఆసక్తి చూపకపోవడంతో పార్టీ సమన్వయకర్తలు అందుబాటులో ఉండటం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సగం నియోజకవర్గాలలో పార్టీ ఇన్చార్జులు పత్తాలేకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా నడవడం లేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కొత్త స్థానాలకు వెళ్లిన నేతలు అక్కడ ఎదురుగాలి వీయడంతో ఫలితాలు వచ్చాక మళ్లీ ఆ నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేదని అంటున్నారు. నేతలకు సంబంధం లేనిచోట, అసలు వారికి పరిచయం, అవగాహన లేనిచోటకు పంపడం, ఆ తర్వాత ఓటమితో నేతలు మళ్లీ ఆ నియోజకవర్గాల వైపు చూడటం లేదని చెబుతున్నారు. అదేసమయంలో రాజకీయాలకు కొత్తగా వచ్చివారిని కూడా కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జిలుగా నియమించారు. అలాంటివారు కూడా ఓటమి తర్వాత మళ్లీ పాలిటిక్స్ అన్న పేరు ఎత్తడం మానేశారు.
ఈ పరిస్థితుల్లో ఇన్ చార్జిలను మార్చాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ ఇంతవరకు ఈ సమస్యపై దృష్టి పెట్టలేదని అంటున్నారు. దీంతో హైకమాండ్ ఆలోచన ఏంటో అంతుబట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరో ఏడాదిలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని, బలమైన కూటమి ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే సమర్థులైన ఇన్ చార్జులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో స్థానికేతర నేతలు ఉండటంతో స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం సవాలే అంటున్నారు. ఈ పరిస్థితులను పార్టీ ఎలా చక్కదిద్దుతుందో చూడాల్సివుందని అంటున్నారు.
