జగన్ తప్పులను విప్పి చెబుతున్న సీనియర్లు!
వైసీపీలో జగనే సర్వస్వం. ఆయనే బాస్. ఆయన మాటకు ఎదురు లేదు. జగన్ తీసుకునే నిర్ణయాలకు ఇష్టపడేవారే అందులో ఉంటారు.
By: Tupaki Desk | 18 May 2025 11:02 PM ISTవైసీపీలో జగనే సర్వస్వం. ఆయనే బాస్. ఆయన మాటకు ఎదురు లేదు. జగన్ తీసుకునే నిర్ణయాలకు ఇష్టపడేవారే అందులో ఉంటారు. లేని వారు బయటకు వెళ్తారు ఇదీ వైసీపీలో గత పదిహేనేళ్ళుగా సాగుతున్న వ్యవహారం.
జగన్ విషయానికి వస్తే ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగు ఉండదు. ఆయన పార్టీ నేతలతో సంప్రదించి తీసుకుంటారా లేక సలహాదారులతో చర్చిస్తారా లేక తన ఆలోచనల మేరకు తీసుకుంటారా అన్న దాని మీద ఎవరికి తోచిన వివరణలు వారికి ఉన్నాయి. కానీ జగనే వైసీపీకి అల్టిమేట్.
సో జగన్ తీసుకునే నిర్ణయాలు తప్పు అని ఎవరూ బహిరంగంగా చెప్పే సాహసం చేయరు అయితే ఇటీవల కాలంలో మాత్రం జగన్ నిర్ణయాల మీద మీడియా ముందు ఆ పార్టీ సీనియర్లు చర్చిస్తున్నారు ఎందుకు 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యామన్న దాని మీద తమదైన వివరణలు విశ్లేషణలు ఇస్తూ వైసీపీ అధినాయకత్వం ఇలా చేసి ఉండాల్సింది అని కూడా అంటున్నారు.
వైసీపీ ఓటమిని వంద కారణాలు అని ఈ మధ్యనే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. వైసీపీ మంచి పనులు ఎన్ని చేసినా ఓడిందని జనాలు బాబు మభ్యపెట్టి ఇచ్చిన హామీలను నమ్మారని వైసీపీ అధినాయకత్వం అంటోంది. అదే ఎక్కువగా పార్టీ వేదికల మీద జగన్ చెబుతూ వచ్చారు. మరి వైసీపీ ఓటమికి వంద కారణాలు అని బొత్స వంటి రాజకీయ అనుభవం కలిగిన వారు అంటున్నారు అంటే అందులో నిజాలు ఉంటాయనే అంటున్నారు. మరి వాటి సంగతి హై కమాండ్ కి తెలియదా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి.
మరో వైపు చూస్తే వైసీపీలో కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అయితే జగన్ అతి మంచితనం వల్లనే పార్టీ ఓటమి పాలు అయిందని తాజాగా వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగింది. వైసీపీ అధినేత జనాలను పైన ఉన్న దేవుడిని నమ్ముకున్నారని ఆయన గుర్తు చేశారు.
తాను చేసిన మంచి పనులే తిరిగి గెలిస్తాయని ఆయన బలంగా నమ్మారని అన్నారు. అయితే చంద్రబాబు లాంటి కుటిల రాజకీయ వ్యూహకర్త ఒకరు ఉన్నారని జగన్ మరచారని రాచమల్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు కుయుక్తులను అర్ధం చేసుకోవడంలో జగన్ వైఫల్యం చెందారని బాహాటంగానే రాచమల్లు సంచలన కామెంట్స్ చేశారు.
చంద్రబాబు మాదిరిగా జగన్ కూడా ఉండి ఉంటే మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేవారమని అన్నారు. జగన్ అతి మంచితనం వల్లనే తాము సంకనాకి పోయామని కీలక వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు నందిని పంది అనగలడని అబద్ధాలు చెప్పి మోసం చేయగలడని జగన్ మాత్రం నిజాలు కూడా చెప్పుకోలేడని అది అతనికి చేత కాదని చేసిన మంచిని చెప్పుకోలేకనే వైసీపీ ఓటమి పాలు అయింది అన్ రాచమల్లు అన్నారు.
ఇక ఇదే తరహాలో మరో సీనియర్ నేత మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ మీద కామెంట్స్ చేశారు జగన్ తప్పు చేశారు అని ఆయన అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం జగన్ చేసిన తప్పు అంటున్నారు. తాము కనుక అలా చేసి ఉంటే అధికారంలోక తప్పక వచ్చేవారని ఆయన చెప్పడం రాజకీయ సంచలనానికి తెర తీసినట్లు అయింది.
మరో వైపు చూస్తే జగన్ విధాన నిర్ణయాల మీద ఆయన నాయకత్వ పటిమ ఆయన వ్యూహాలలో వైఫల్యాల మీద నాయకులు ఇలా బయటకు వచ్చి మీడియా ముందు ఈ రోజు చెబుతున్నారు. అదే నాయకులు వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఎందుకు చెప్పలేకపోయారు అన్న చర్చ వస్తోంది.
వారికి ఆ అవకాశం అధినాయకత్వం ఇవ్వలేదా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అంతే కాదు వైసీపీ అధినాయకుడు బాబు వ్యూహాలను అర్ధం చేసుకోలేకపోయారు అంటే ప్రత్యర్ధి ముందు కోరి మరీ చిత్తు కావడమే కదా అని అంటున్నారు. అలాగే పొత్తుల విషయంలో వైసీపీ రాజకీయ పాలసీ మారాలని నేతలు అంటున్నారు. వైసీపీ ఓటమికి వంద కారణాలు అంటున్నారు. మరి ఇవన్నీ అధినాయకత్వం ఇప్పటికైనా పట్టించుకుంటుందా ఇంతకీ తప్పులు జరిగాయని అంగీకరించడానికి హై కమాండ్ ముందుకు వస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి రానున్న కాలంలో మరెంత మంది సీనియర్లు నోరు విప్పి జగన్ తప్పులు అప్పచెబుతారో.
