Begin typing your search above and press return to search.

ప్రజలను మచ్చిక చేసుకోకుండా ఈ ప్రకటనలేంటి బాసూ..

తాజాగా జగన్ మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటనలు రాజకీయంగా విమర్శల పాలవుతున్నాయి.

By:  Tupaki Desk   |   6 July 2025 11:50 AM IST
ప్రజలను మచ్చిక చేసుకోకుండా ఈ ప్రకటనలేంటి బాసూ..
X

వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అధికారంపై మమకారం పోగొట్టుకోలేక.. ఎన్నికలు జరిగిన ఏడాదికే మళ్లీ వచ్చేది మేమే అంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తుండడాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దురుసు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలను మంచి చేసుకోకుండా.. ఓడిన ఏడాదికే మళ్లీ అధికారం అంటూ తమను తాము మోసపుచ్చుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్నప్పటికీ ఇవేం ప్రకటనలు బాసూ అంటు కొందరు ప్రశ్నిస్తున్నారు.

పార్టీ కేడర్ లో ధైర్యం నింపడానికో లేక నాలుగేళ్ల తర్వాత కచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకంతోనో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతి పార్టీ సమావేశంలోనూ మనమే అధికారంలోకి వస్తున్నామని ప్రకటనలు చేస్తుంటారు. అదే సమయంలో టీడీపీ నేతలకు సినిమా చూపిస్తామని చెబుతుంటారు. అధినేతగా కేడర్ లో స్థైర్యం కోసం జగన్ అలా మాట్లాడుతున్నారని భావించినా, మిగిలిన నేతలు కూడా అదే తరహా ప్రకటనలు చేయడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాకుండా జగన్ కంటే ఓ ఆకు ఎక్కువే తిన్నట్లు.. వారి సొంత నిర్ణయాలు పార్టీ అమలు చేస్తుందనే తరహాలో నేతలు ప్రకటనలు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజాగా జగన్ మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటనలు రాజకీయంగా విమర్శల పాలవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తూనే టీడీపీ నాయకులు, కార్యకర్తల పనిపడతాం అంటూ రవీంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఇకపై సొంత పార్టీ కార్యకర్తలకే పథకాలిస్తామని, టీడీపీ సానుభూతిపరుల పథకాలను కట్ చేస్తామని ఆయన చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. మీరు అధికారంలోకి వచ్చేదెప్పుడు..? ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగానే ఇలాంటి ప్రకటనలు అవసరామా? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కలలు కనడం మంచిదే కానీ, మరీ ఇంత కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రజలను మంచి చేసుకోకుండా, ఇంకా ఇలాంటి కలలు కనడం వల్ల ఉపయోగమేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు గడిచిన ఏడాదిలో ఒకసారి కూడా తాము ఎందుకు ఓడిపోయామో అన్న అంతర్మథనం లేకుండా, మళ్లీ మళ్లీ అవే ప్రకటనలతో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారని పార్టీ సానుభూతిపరులు వాపోతున్నారు. అధినేత అన్నారని కింద స్థాయి నేతలు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టమే ఎక్కువ జరుగుతుందని అంటున్నారు.