హమ్మయ్య.. జగన్ హ్యాపీ.. !
ఇక, దీనిపై జిల్లా స్థాయిలో అదే విధంగా రాష్ట్రస్థాయిలో మండల స్థాయిలో కూడా ఉద్యమాలు చేస్తామని ప్రజల మధ్యకు వెళ్తామని కూడా జగన్ పిలుపునిచ్చారు.
By: Garuda Media | 17 Sept 2025 10:00 PM ISTనిన్న మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న వైసిపి నాయకులు ఒకింత లైన్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో తాము తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలను పిపిపి విధానంలో ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందని చెప్పారు. దీనిని తీవ్రస్థాయిలో తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ కాలేజీలను దక్కించుకునే వారికి కూడా ఆయన తీవ్రస్థాయిలో హెచ్చకిరలు జారీ చేశారు. తాము వచ్చాక వెనక్కి తీసుకుంటామని, కాంట్రాక్టులను రద్దు చేస్తామని చెప్పారు.
ఇక, దీనిపై జిల్లా స్థాయిలో అదే విధంగా రాష్ట్రస్థాయిలో మండల స్థాయిలో కూడా ఉద్యమాలు చేస్తామని ప్రజల మధ్యకు వెళ్తామని కూడా జగన్ పిలుపునిచ్చారు. తాను కూడా అక్కడక్కడా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటానని కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటివరకు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల్లో ఈ నాలుగు రోజులు కాలంలో కొంత మేరకు ఊపు కనిపించింది అనే చెప్పాలి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా నాయకులు స్పందిస్తున్నారు. పార్టీ తరఫున వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో కొన్ని కాలేజీలు నిర్మాణం పూర్తయిందని, మరికొన్ని పునాదుల దశలో ఉన్నాయని, ఇంకొన్నింటికి భవనాలు కూడా కట్టారని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదనపు హంగులు మాత్రమే వేయాల్సి ఉందన్నది నాయకులు చెప్పిన మాట. ఏదేమైనా గత 15 మాసాలుగా పరిస్థితిని గమనిస్తే వైసిపి తరఫున బలంగా నాయకులు స్పందించడం అనేది గతంలో అయితే కనిపించలేదు. ప్రస్తుతం మాత్రం వైసిపి నాయకులు కొంత స్పందన అయితే కనిపించింది. ఈ విషయంపై తాజాగా జగన్ ఆనందం వ్యక్తం చేశారని తెలిసింది.
ఇదే తరహాలో మున్ముందు కూడా నాయకులు స్పందించాలని సూచించినట్టు తెలిసింది. అనంతపురం నుంచి అనకాపల్లి దాకా నాయకులు ఉత్సాహంగా ఈ విషయంపై బయటికి రావడం నిజంగానే వైసీపీలో ఆనందాన్ని నింపిందనే చెప్పాలి. మరి ముందు ముందు ఎట్లా స్పందిస్తారు అనే దాన్నిబట్టి ఇతర విషయాలు ఆధారపడి ఉన్నప్పటికీ ప్రస్తుతం కీలకమైన వైద్య కళాశాల విషయంలో మాత్రం వైసిపి నాయకులు స్పాంటేనియస్ గా స్పందించారన్నది పార్టీలోనే జరుగుతున్న చర్చ. దీంతో జగన్ కొంత హ్యాపీగా ఫీల్ అయ్యారని అంటున్నారు. అయితే ఈ స్పందన అనేది సందర్భాన్ని బట్టి కార్యక్రమాన్ని బట్టి మారే అవకాశం కూడా లేకపోలేదు.
