గ్లాసు పట్టారు.. మ్యూట్ అయ్యారు.. ఏం జరిగింది ..!
రాజకీయాల్లో మార్పులు సహజం. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారన్నది ఆయా పార్టీలు అనుసరించే వ్యూహ ప్రతివ్యూహాలను బట్టి ఉంటుంది.
By: Tupaki Desk | 1 July 2025 7:00 AM ISTరాజకీయాల్లో మార్పులు సహజం. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారన్నది ఆయా పార్టీలు అనుసరించే వ్యూహ ప్రతివ్యూహాలను బట్టి ఉంటుంది. స్వింగ్‌లో ఉన్న పార్టీ అయినా ఒక్కసారి పరాజయం పాలైతే.. మారుతున్న నాయకులు కనిపిస్తున్నారు. ఇలానే.. గత ఏడాది ఎన్నకల అనంతరం వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. పార్టీ అధినేత జగన్ వైఖరిని విమర్శించిన వారు.. పార్టీలో అంతర్గత వ్యవహారాలు నచ్చక వచ్చిన వారు ఉన్నారు.
ఇలాంటి వారిలో కీలక నాయకులు కొందరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. భవిష్యత్తుపై ఆశతో కావొచ్చు .. తమ ఆకాంక్షలు నెరవేరుతాయన్న ఉద్దేశంతో కావొచ్చు.. ఏదేమైనా.. నాయకులు పార్టీ మారారు. అయి తే.. ఇలా వచ్చిన వారేమీ తక్కువ తరహా నాయకులు కారు. స్థానికంగా, సామాజిక వర్గం పరంగా మంచి ఊపు ఉన్నవారే. కానీ, ఎందుకో.. కారణం తెలియదు కానీ.. పార్టీ మారినా వారిలో ఉత్సాహం మాత్రం కని పించడం లేదు. దూకుడు ప్రదర్శించడమూ లేదు.
ఇక, నాయకుల విషయానికి వస్తే.. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వంటివారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీపై పెద్దగా విమర్శలు చేయక పోయినా.. ఆ పార్టీ వ్యవహారాలు నచ్చలేదన్నారు. అయితే..జనసేనలోకి వచ్చిన తర్వాత కూడా వారు సైలెంట్‌గానే ఉన్నారు.
ఉదాహరణకు సామినేనికి ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడుగా పదవిని ఇచ్చారు. కానీ, ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన వాయిస్ కూడా పెద్దగా వినిపించడం లేదు. ఇక, బాలినేని బలమైన నాయకడే అయినా.. ఆయన కూడా ఎక్కడా పెదవి విప్పడం లేదు. కనీసం.. బయటకు వచ్చి ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు. రోశయ్య, దొరబాబుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. మరి వీరికి చేసేందుకు జనసేనలో స్కోప్ లేదా? లేక.. వారికి జనసేనలో ఇస్తామన్న హామీలు నెరవేరలేదా? అనేది చర్చ. ఏదేమైనా.. గ్లాసు పట్టుకున్న నాయకులు.. సైలెంట్ కావడం ఆ పార్టీలో ఆసక్తిగా మారింది.
