వైసీపీ నేతలకు `ఐటీ` జ్వరం.. ఏం జరుగుతోంది..!
వైసీపీ నాయకులు ఖర్చుకు వెనుకాడుతున్నారా? రూపాయి తీసేందుకు నసుగుతున్నారా? అంటే.. ఔన నే తెలుస్తోంది.
By: Tupaki Desk | 8 May 2025 11:30 PMవైసీపీ నాయకులు ఖర్చుకు వెనుకాడుతున్నారా? రూపాయి తీసేందుకు నసుగుతున్నారా? అంటే.. ఔన నే తెలుస్తోంది. తాజాగా కొత్తవారికి పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన తర్వాత.. వారు నియోజకవర్గాలకు కూడా వెళ్లలేదు. వీరిలో ఒకరిద్దరు మాత్రం నియోజకవర్గ నాయకులతో మాట్లాడారు. మిగిలిన వారు మనకెందుకు.. అనుకున్నారో, లేక ఇంకా సమయం ఉందని భావించారో తెలియదు కానీ.. మౌనంగానే ఉంటున్నారు.
మరోవైపు, పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దీంతో అసలు ఏం జరుగుతోందని పార్టీ అధినేత ఆరా తీయగా.. నియోజకవర్గాలకు వెళ్లేందుకు, నాయకులతో భేటీ అయ్యేందుకు కూడా నాయకులు వెనుకంజ వేస్తున్నారన్న విషయం వెలుగు చూసింది. ఒక వెయ్యి, రెండు వేలు ఖర్చు పెట్టేందుకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ, ఎన్నికల తర్వాత ఏడాది కాలానికి నియోజకవర్గానికి వస్తే.. ఆ రేంజ్ వేరేగా ఉంటుంది. భోజనాలు, ఇతర ఏర్పాట్లకు లక్షల రూపాయల్లో ఖర్చు తప్పదు.
దీనిని పెట్టేందుకు నాయకులు వెనుకాడుతున్నట్టు తెలిసింది. దీనిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``ఇప్పుడు రూపాయి తీసి ఖర్చు పెట్టకపోతే.. మన పరువేపోతుంది. మీరు ఆలోచించుకోవాలి`` అని తేల్చి చెప్పారు. నిజానికి పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా నియమించిన వారిలో మెజారిటీ నాయకులు ధనవంతులు, వ్యాపారులే. ఒకరిద్దరు మాత్రమే మధ్యతరగతి వర్గాలుగా ఉన్నారు. మరి వీరు ఎందుకు నిధులు బయటకు తీయడం లేదన్న చర్చ ఉంది.
వచ్చే ఎన్నికల్లో పార్టీ పుంజుకుని అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నది మెజారి టీ నాయకుల అంతరంగం చెబుతోంది. కూటమి పదిలంగా ఉన్నంత వరకు.. తమపై సానుభూతి దక్క దని కూడా అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారు రూపాయి తీసేందుకు వెనుకాడుతున్న పరిస్థితి ఉంది. పైగా.. ఇప్పుడే సొమ్ములు ఖర్చు చేస్తే.. తమకు ఇబ్బందులు ఎదురవుతాయని కూడా అంచనా వేసుకుంటున్నారు. ఐటీ, ఈడీ వంటివి కేంద్రం అధీనంలో ఉండడం.. రాష్ట్రంలో కూటమిగా బీజేపీ ఉండడంతో నాయకులు వెనుకంజ వేస్తున్నారన్నది నిజమేనని పార్టీ నాయకులు చెబుతున్నారు.